
నేటి నుంచి గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టండి
● జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ● నేటి నుంచి కేంద్ర బృందాలు గ్రామాల సందర్శన
నరసరావుపేట: ఏఎంఎస్ కేంద్ర బృందాలు బుధవారం నుంచి గ్రామాలు సందర్శన చేసి స్వచ్ఛతపై సర్వే నిర్వహిస్తున్నందున జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీఓలు అందరూ గ్రామాల్లో ఉండి పారిశుద్ధ్య నిర్వహణలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 2025 వర్క్‌షాప్ నిర్వహించి పంచాయతీరాజ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. కేంద్ర బృందాలు సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్, హౌస్ హోల్డ్ అసెస్‌మెంట్, పబ్లిక్ ప్లేసెస్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్స్, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణ, సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లపై సర్వే నిర్వహించి గ్రామాలకు ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే పంచాయతీరాజ్ సిబ్బందికి వేయి మార్కుల పరీక్ష వంటిదని పేర్కొన్నారు. సర్వేను సమర్థవంతంగా నిర్వహించడంలో కేంద్ర బృందానికి సహకారం అందించి జిల్లాను ర్యాంకింగ్‌లో ముందుంచాలని ఆదేశించారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, డీఎల్‌డీఓలు ఎం.వెంకటరెడ్డి, రాజగోపాల్, గబ్రు నాయక్, నరసరావుపేట డీఎల్‌పీఓ లక్ష్మణరావు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ఏడుకొండలు హాజరయ్యారు.