
సెంటు ప్రభుత్వ భూమి ఆక్రమించినా
వినుకొండ: వినుకొండలో తాను ప్రభుత్వ భూమి ఆక్రమించానని స్థానిక టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేయిస్తున్నారని.. ఎక్కడైనా సెంటు భూమి ఆక్రమించినట్లు తేలితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కొనలేక తన పరువునకు భంగం కల్గించేలా అసత్య ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. అసత్య ప్రచారాన్ని ఖండించారు.
కూటమి ప్రభుత్వంపై
ప్రజల్లో అసంతృప్తి
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగి జగన్ పర్యటలనకు వేలాదిగా జనాలు రావడం చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా ప్రభుత్వం ఆంక్షలు విధించడం దారుణమన్నారు. జగన్ పర్యటన సందర్భంగా గుంటూరు సమీపంలో వేరే వాహనం తగిలి ఓ వృద్ధుడు మృతిచెందితే జగన్ కాన్వాయ్ తగిలి మృతి చెందాడని కూటమి నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. జిల్లా ఎస్పీ జగన్ కాన్వాయ్‌లో వాహనం వల్ల చనిపోలేదని చెప్పినా విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. సత్తెనపల్లిలో ఓ అభిమాని గుండెపోటుతో చనిపోతే ఆ మరణం కూడా జగన్ ఖాతాలో వేసి పైశాచిక అనందం పొందుతున్నారని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కారణంగా గోదావరి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతిచెందారని, సింహాచలం అప్పన్న దేవాలయంలో గోడ కూలి 8 మంది మృతి చెందారని, కందుకూరు సభలో 8 మంది మృతిచెందారని, గుంటూరులో ముగ్గురు మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. నిరుద్యోభృతి ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకుండా నిరుద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం వెంటనే హామీ నెరవేర్చాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీనాయకులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా
అసత్య ప్రచారాన్ని ఖండించిన
మాజీ ఎమ్మెల్యే బొల్లా