
అడవిలో రేగిన మంటలను అదుపు చేస్తున్న జాజి
● నల్లమల అడవిలో కార్చిచ్చు ● అదుపునకు కృషి చేసిన పర్యావరణ ప్రేమికుడు
కారెంపూడి: పర్యావరణ ప్రేమికుడు అతని స్నేహితుని సాయంతో అడవిలో చెలరేగిన మంటలను ఆర్పివేసి అడవి దగ్ధం కాకుండా కాపాడిన ఘటన పల్నాడు జిల్లా కారెంపూడి శివారులోని నల్లమల అడవిలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని సింగరుట్ల అగ్రహారం ఎత్తయిన కొండపై మంటను చూసిన కారెంపూడికి చెందిన కొమెర అంకారావు (జాజి), అతడి స్నేహితుడు విజయ్‌తో కలసి కొండ ఎక్కి మంటలను ఆర్పేందుకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రమించారు. అక్కడ నీటి లభ్యత లేకున్నా కేవలం పచ్చి చెట్ల మండలతో మంటను ఆర్పివేశారు. వేసవి ఎండలు కాస్తుండడంతో నల్లమల అడవిలో గడ్డి చెట్లు చాలా వరకు ఎండిపోయాయి. అడవిలో ఎత్తయిన కొండలపై వీస్తున్న గాలికి వ్యాపిస్తున్న మంటలను ఆర్పేందుకు వారు శ్రమించారు. ఎంతో కాలంగా నిత్యం నల్లమల అడవిలో గడుపుతూ అక్కడ మొక్కలు నాటి వాటిని కాపాడుతూ అడవిలో మందుబాబులు తాగిపడేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌ను సీసాను ఇతర వ్యర్థాలను ఏరి అడవి బయటకు తరలించే పనిని జాజి చాలా కాలంగా చేస్తున్నారు. ఈ క్రమంలో కొండపై మంటలను చూసి ఆయన స్పందించి అడవి దగ్ధం కాకుండా కాపాడారు.
చచ్చి బతికాం.. కొమెర జాజి
కిలో మీటరు దూరం కొండను ఎక్కాం. కూడు నీళ్లు లేవు. తీసుకెళ్లిన వాటర్ బాటిల్‌లో కొంచెం కూడా మంట తగలడం వలన లేకుండా పోయాయి. నిర్విరామంగా ఆర్పితేనే మంటలు ఆరిపోయాయి. సాయంత్రం కొండె దిగే టప్పుడు పిక్కలు పట్టుకుపోయాయి. నోరు పిడసకట్టుకుపోయింది. అలాగే దోగాడుకుంటూ కొండ దిగాం. ఎక్కడ ప్రాణం పోతుందోననే భయంతో సింగరుట్ల నరసింహస్వామి ఆలయం కొండ దొన కింద నీటితో గొంతు తడుపుకుని బతికాం.