నేటి నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల అమ్మకం
భువనేశ్వర్: భారత్, దక్షిణాఫ్రికా జట్ల టీ20 మ్యాచ్ టికెట్లు ఆన్‌లైన్ అమ్మకం సోమవారం ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 5 నుంచి కౌంటర్లలో ఆఫ్‌లైన్ టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభిస్తారు. ఆన్‌లైన్‌లో 2,000 టిక్కెట్లు మాత్రమే విడుదల చేస్తారు. 23,000 టిక్కెట్లు ఆఫ్‌లైన్ అమ్మకానికి కేటాయించారు. 18,400 కాంప్లిమెంటరీ పాస్‌లు జారీ చేయనున్నట్లు ఓసీఏ కార్యదర్శి సంజయ్ బెహరా తెలిపారు. ఈ నెల 3, 4 తేదీల్లో ఓసీఏ అనుబంధ సంస్థలు, క్లబ్‌లకు టిక్కెట్లు జారీ చేస్తారు. 5వ తేదీన కౌంటర్‌లో సాధారణ ప్రేక్షకులకు టిక్కెట్లు అమ్మకం ప్రారంభిస్తారు. మునుపటి మ్యాచ్ కంటే ఈసారి 2500 టిక్కెట్లు తక్కువ విక్రయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ లెక్కన మొత్తం 23,000 టిక్కెట్లు విక్రయిస్తారు. 11,000 టిక్కెట్లు ఓసీఏ అనుబంధ సంస్థలకు, 10,000 టిక్కెట్లు కౌంటర్‌లో సాధారణ ప్రేక్షకులకు, 2 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆన్‌లైన్‌లో 2,000 టిక్కెట్లు అమ్ముతారు. కొత్త పెవిలియన్, స్పెషల్ ఎన్‌క్లోజర్, ఏసీ బాక్స్, గ్యాలరీ 2, 4 – 7 టికెట్లు ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టిక్కెట్లకు ప్రామాణీకరణ తప్పనిసరి. ఈ నెల 8, 9 తేదీల్లో వరుసగా రెండు రోజులపాటు ఆన్‌లైన్ టికెట్ల ప్రామాణీకరణకు వీలు కల్పించారు. డిసెంబర్ 8న ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటలు, డిసెంబర్ 9న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేంబ్రిడ్జ్ స్కూల్ ప్రాంగణంలో ఆన్‌లైన్ టికెట్ల ప్రామాణీకరణకు ఏర్పాట్లు చేశారు.
ఆఫ్‌లైన్ అమ్మకాల వేళలు
తొలి విడతలో ఓసీఏ అనుబంధ సంస్థలకు ఆఫ్‌లైన్ టికెట్లు మంజూరు చేస్తారు. ఈ టికెట్లు డిసెంబర్ 3, 4 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారత స్టేటు బ్యాంకు ఆధ్వర్యంలో ఓసీఏ కాన్ఫరెన్స్ హాల్‌లో జారీ చేస్తారు.
కౌంటర్లలో సాధారణ ప్రేక్షకుల టికెట్లు
సాధారణ ప్రేక్షకులకు బారాబటి స్టేడియం ప్రాంగణంలో టికెట్లు విక్రయిస్తారు. ఈ వర్గాలకు డిసెంబర్ 5 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరవధికంగా విక్రయిస్తారు. టికెటు కొనుగోలు కోసం చెల్లుబాటు అయ్యే ఐడీ ఉన్న వ్యక్తికి గరిష్టంగా 2 టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు.
నేటి నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల అమ్మకం


