
భయపెడుతున్న వరద
కొరాపుట్:
కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలో నదులు కట్టలు తెంచుకున్నాయి. గురువారం రాష్ట్రంలో అత్యధిక వర్షపాతంగా కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్‌లో 152 మిల్లీమీటర్లు పడింది. ఈ విషయం రాష్ట్ర వాతావరణ శాఖ ప్రత్యేక బులెటిన్‌లో ప్రకటించింది. లమ్తాపుట్ సమితిలో ఆంధ్రా–ఒడిశా ఉమ్మడి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మాచ్‌ఖండ్‌లో డీ డ్యాం లో 6,7 గేట్లు ఎత్తేశారు. ఈ రెండు గేట్ల నుంచి క్యూసెక్కుల నీటిని చిత్రకొండ జలపాతానికి వదిలారు. డ్యామ్ సామర్థ్యం 2,590 అడుగులు కాగా అక్కడ 2,588 అడుగుల వరకు నీటి పరిమాణం వచ్చింది. గత ఐదు రోజుల్లో ఈ బేసిన్‌లో 262 మిల్లీ మీటర్ల వర్షం పడింది. దీంతో నీటిని వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం డ్యామ్‌లో 2,586.5 అడుగుల నీరు ఉంది.
రైతుల కష్టాలు
కుంద్రా సమితిలో పొలాల్లో నీరు నిల్వ ఉండిపోయింది. 25 ఎకరాల పంట పొలంలో ధాన్యం మొలకలెత్తాయి. ఈ రైతులకు ధాన్యం కొనడానికి ఇప్పటికే ప్రభుత్వం టోకెన్లు ఇచ్చింది. ఇప్పుడు ఆ ధాన్యం ఏం చేయాలో తెలియక రైతులు రోదిస్తున్నారు. లమ్తాపుట్ సమితిలో కల్వర్టు వద్ద నీరు ప్రవహిస్తోంది. నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్ కోట్ సమీపం డొడ్ర వద్ద రోడ్లు తెగి వర్షం నీరు పారుతోంది. ఈ ప్రాంతాన్ని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రమేష్ సాహు సందర్శించారు. పరిస్థితి మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్లారు.
కొరాపుట్ జిల్లాలో 47 ఇళ్లు ధ్వంసం
గురువారం ఉదయానికి కొరాపుట్ జిల్లాలో వర్షాల వల్ల 47 ఇళ్లు కూలి పోయాయి. బాధిత ప్రజలు తమ వద్దకు ప్రభుత్వ సిబ్బంది వచ్చి పరిహారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నందపూర్ సమితి సెమలా వద్ద రోడ్డు పై భారీవృక్షం కూలి పోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. నందపూర్ అగ్ని మాపక బృందం వచ్చినప్పటికీ భారీ వృక్షం కావడంతో తొలగించడం కష్టమైంది. దీంతో స్థానిక గిరిజనుల సాయంతో చెట్టును తొలగించారు. నబరంగ్‌పూర్ జిల్లా ఖాతీ గుడకి వెళ్లే మార్గంలో లమ్తాగుడ వద్ద కల్వర్టు మునిగి పోయింది. దీంతో ఇంద్రావతి నుండి జిల్లా కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి.

భయపెడుతున్న వరద