
కిరండోల్–కొత్తవలస రైల్వేలైన్ పునరుద్ధరణ
కొరాపుట్: కొత్తవలస–కిరండోల్ రైల్వే లైన్ పునరుద్ధరణ కోసం భారీ ఎత్తున్న రైల్వే సిబ్బంది మోహరించారు. బుధవారం కొరాపుట్–జయపూర్ రైల్వే స్టేషన్ల మార్గంలో జర్తి–మాలిగుడల మధ్య పెద్ద ఎత్తున మట్టి చరియలు ట్రాక్ మీదకు చొచ్చుకువచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. బుధవారం సాయంత్రం నుంచి గురువారం రాత్రి వరకు రైల్వే సిబ్బంది మట్టిని తొలగించడానికి పనులు చేస్తున్నారు. కురుస్తున్న భారీ వర్షాలు పనులకు ఆడ్డంకిగా మారాయి. 13 హెవీ జేసీబీలు, పదుల సంఖ్యలో ట్రక్‌లు, సుమారు 300 మందికి పైగా కార్మికులు ఈ పనులలో నిమగ్నమయ్యారు. రాళ్లు తొలగిస్తున్నప్పటికీ వర్షం నీరు వస్తుండడంతో పనులు మరింత ఆలస్యం అవుతున్నాయి. రాయగడ రైల్వే డీఆర్‌ఎం అమితాబ్ సింఘాల్ సంఘటన స్థలంలో టెంట్ వేసుకొని మకాం వేశారు. రాత్రింబవళ్లు డీఆర్‌ఎం అక్కడే ఉండడంతో పనులు నిరాటంకంగా జరుగుతున్నాయి.ఇప్పటికే జగదల్‌పూర్–భువనేశ్వర్, జగదల్‌పూర్–రౌర్కెలా, కిరండోల్– విశాఖ పట్నం ప్యాసింజర్, కిరండోల్–విశాఖపట్నం నైట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేశారు. గురువారం కూడా కిరండోల్–కొరాపుట్‌ల మధ్య రైళ్లు నడవలేదు. కొరాపుట్ రైల్వే స్టేషన్ నుంచి కొన్ని రైళ్లు నడుపుతున్నారు. శుక్రవారం ఉదయానికి పునరుద్ధరణ పనులు పూర్తవ్వవచ్చని రాయగడ డీఆర్‌ఎం అమితాబ్ సింఘల్ ప్రకటించారు.

కిరండోల్–కొత్తవలస రైల్వేలైన్ పునరుద్ధరణ

కిరండోల్–కొత్తవలస రైల్వేలైన్ పునరుద్ధరణ

కిరండోల్–కొత్తవలస రైల్వేలైన్ పునరుద్ధరణ