రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్‌ మృతి

Jul 6 2025 6:35 AM | Updated on Jul 6 2025 6:35 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్‌ మృతి

రాయగడ: మారు రథయాత్రలో విధులు నిర్వహించేందుకు తన సొంత గ్రామమైన ఖెదాపడ నుంచి స్కూటీపై రాయగడ వస్తున్న మహిళా కానిస్టేబుల్‌ రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు. మృతురాలు లావణ్య గంట (24 )గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. చందిలి పోలీసుస్టేషన్‌ పరిధి గునాఖాల్‌ రోడ్డు కూడలి వద్ద లావణ్య నడుపుతున్న స్కూటీని వెనుక నుంచి వస్తున్న బైక్‌ ఢీకొంది. దీంతో ఆమె తన ఎదురుగా వస్తున్న లారీకింద పడిపోవడంతో తీవ్రగాయాలపై సంఘటన స్థలంలోనే మృత్యువాతపడింది. బైక్‌పై వస్తున్న బిసంకటక్‌ పరిధి మునిగా గ్రామానికి చెందిన కాంతారావు కడ్రక, సుబ్బారావు కడ్రకలు కూడా కిందపడిపోయి తీవ్రగాయాలకు గురై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కానిస్టేబుల్‌ లావణ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని జిల్లా కేంద్రాస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి

మాజీ మంత్రి, ఆదివాసీ నేత జయరాం పంగి డిమాండ్‌

జయపురం: దండకారణ్య ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, అవిభక్త కొరాపుట్‌ ఆదివాసీ నేత, దండకారణ్య పర్వతమాల వికాస పరిషత్‌ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నాయకుడు జయరాం పంగి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. కొరాపుట్‌, నవరంగపూర్‌, రాయగడ, మల్కన్‌గిరి, గజపతి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం, పాడేరు ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తన డిమాండ్‌కు ఆ ప్రాంతాల నేతలు, ప్రజలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. స్వతంత్ర రాష్ట్రం ఏర్పడితే ఇంతవరకు ఒడిశా– ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

చిరుత దాడిలో 5 మేకలు మృతి

మల్కన్‌గిరి: జిల్లాలోని ఖోయిర్‌పూట్‌ సమితి కుమారపూట్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి చిరుత దాడిలో మేకలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సమారీ దాంగడమాఝి అనే వ్యక్తి తన మేకలను ఒక శాలలో కట్టి ఇంటికి వెళ్లాడు. అయితే శనివారం ఉదయం వచ్చి చూస్తే 5 మేకలను పులి చంపి పడేసింది. ఒక మేకను పులి ఈడ్చుకొని వెళ్లినట్లు ఆనవాలు ఉన్నాయి. ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మత్తిలి రేంజర్‌ వాసుదేవ్‌ నాయక్‌ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒక్కో మేకకు పరిహరంగా రూ.3,000 చొప్పున రైతుకు అందజేశారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి

రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి కొలనార సమితి సూరి పంచాయతీలోని బొడొపొడియా గ్రామానికి చెందిన పెంటి ఉలక(64)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బ్యాంకు పనిమీద పెంటి తన బంధువులతో స్యూటీపై వస్తోంది. అదే సమయంలో స్థానిక జియోమార్ట్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న ఒక బస్సు స్యూటీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన ఆమె సంఘటన స్థలం వద్దే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో  మహిళా కానిస్టేబుల్‌ మృతి 1
1/1

రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement