
కమల దళపతి ఎవరో..?
భువనేశ్వర్: రాష్ట్రంలో అధికార పక్షం భారతీయ జనతా పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకోనుంది. కొత్త సారథిపై రాష్ట్ర రాజకీయ పక్షాలు పలు అంచనాలతో ఉన్నాయి. ప్రధానంగా ఈ వర్గాలు పాలక పార్టీ నాయకత్వ సారథ్యం యథాతథంగా కొనసాగుతుందా లేదా మార్పు వస్తుందా అనేది చూస్తున్నాయి. రానున్న 48 గంటల్లో ఈ ఉత్కంఠకు తెర పడుతుంది. దీనిలో భాగంగా ఆదివారం రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ అవుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రతాప్ చంద్ర షడంగ తెలిపారు. ఔత్సాహిక అభ్యర్థులు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మరియు కేంద్ర కార్యవర్గ సభ్యులుగా పోటీ చేసేందుకు ఈనెల 7వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు.
మూడేళ్ల పదవీ కాలం
కొత్త అధ్యక్షుడి సారథ్యంపై రాష్ట్రంలో బీజేపీ మనుగడ ముడిపడి ఉంది. ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ, ప్రభుత్వ సంబంధాన్ని మరియు ఒడిశా రాజకీయ పరపతిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటివరకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, కేంద్రంలో నరేంద్ర మోదీ, అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్ మధ్య అద్భుతమైన సమన్వయం ఫలిత ఆధారిత దక్షతను చాటుకుంది. మన్మోహన్ సామల్ తిరిగి ఎన్నికై తే ఈ పరిస్థితి యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. ఆయన పదవీ కాలంలో పలు కీలక అంశాలు హుందాగా పరిష్కరించబడ్డాయి. రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ పాలన పగ్గాలు చేపట్టినా ఎటువంటి ఒడిదుడుకులకు అవకాశం లేకుండా తన వంతు కర్తవ్యాన్ని దక్షతతో నిర్వహించి పార్టీ అంతర్గత వ్యవహారాల్ని వివాదరహితంగా నిర్వహించారు.
నాయకత్వం మారితే...
నాయకత్వం మారితే సమన్వయ సమీకరణాలు కొత్త పుంతలు తొక్కడం తథ్యం. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశాలపై హోరా హోరీ పోరు కొనసాగుతోంది. కొత్త నాయకుని సారథ్యంలో బీజేపీ రాజకీయ వ్యూహం ఎలా ఉంటుందో పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొత్త అధ్యక్షుడికి వివిధ ప్రభావవంతమైన రాష్ట్ర నాయకులకు ఉన్న సామీప్యత పరిశీలనలోకి వస్తుంది.
రాష్ట్ర బీజేపీ తన ప్రస్తుత సమతుల్యతను కాపాడుకుంటుందా లేదా దాని అంతర్గత అధికార నిర్మాణాన్ని మరియు రాజకీయ వ్యూహాన్ని పునర్నిర్మించగల పరివర్తనను స్వీకరిస్తుందా అనే దానిపై అందరి దృష్టి ఉంది. రానున్న 48 గంటలు పార్టీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయి. అవసరమైతే ఈనెల 8న ఎన్నికలు జరుగుతాయి. కొత్త రాష్ట్ర శాఖ ప్రముఖుడు (అధ్యక్షుడు) మరియు కేంద్ర మండలి సభ్యుల పేర్లను అదే రోజున ప్రకటిస్తామని ప్రతాప్ చంద్ర షడంగి తెలిపారు. పూరీలో రథయాత్రలో తొక్కిసలాట ఘటనతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మరియు కేంద్ర మండలి సభ్యుల ఎన్నిక స్వల్పంగా వాయిదా పడింది.
ఉత్కంఠగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక
నేడు నోటిఫికేషన్ జారీ