
ఆశ్రమ పాఠశాలలో భారీ కుంభకోణం
కొరాపుట్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సామగ్రిలో భారీ కుంభకోణం జరిగిందని ప్రతిపక్ష బీజేడీ పార్టీ ఆరోపించింది. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం 28 వేల ప్లేట్లు కొనుగోలు చేసిందన్నారు. కానీ వాటి వాస్తవ ధర రూ.120 కాగా, టెండర్ మాత్రం రూ.400లకి ఖరారు చేశారన్నారు. ఇలాంటి కుంభకోణం తాము ఏనాడు చూడలేదన్నారు. హాస్టల్‌లో ఉండే పెద్ద తపేలా ఖరీదు రూ.3,200లు కాగా, దానిని రూ.11 వేలకి కొనుగోలు చేశారని మండిపడ్డారు. రూ.30 వేల దోమ తెరలను ఒక్కొక్కటీ రూ.2 వేలకు కొనుగోలు చేశారని, అయితే దోమ తెరలు రూ.2 వేలు ఎక్కడైనా ఉంటుందని ప్రశ్నించారు. ఇలా అనేక విధాలుగా విద్యార్థుల సొమ్మును కాజేశారని ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, నాయకులు సరోజ్ పాత్రో, భీమొ పూజారి, లల్లు త్రిపాఠి, దిలీప్ పండా, ప్రమెద్ రథ్, సుమిత్ పూజారి తదితరులు పాల్గొన్నారు.
బీజేడీ నాయకుల ఆరోపణ