
రూ.1.38 కోట్లతో దంపతులు పరారీ
పర్లాకిమిడి: స్వయం సహాయక సంఘాలు, ఉద్యోగులు, రాజకీయ నాయకుల వద్ద నుంచి రూ.1.38 కోట్ల డబ్బులు తీసుకొని దంపతులు పరారైన ఘటన పట్టణంలో వెలుగు చూసింది. ఈ దంపతులు మహిళా స్వయం సహాయక గ్రూపులకు బ్యాంకు రుణాలు ఇస్తామని చెప్పి తొలుత రుణాలు మంజూరు చేయించారు. అనంతరం ఉద్యోగులు, రాజకీయ నాయకులకు అతి తక్కువ వడ్డీతో బంగారం కుదువపెట్టి రుణాలు మంజూరు చేసేవారు. ఆ తర్వాత వారి పేర్ల మీద ఎక్కువ మొత్తంలో వివిధ బ్యాంకుల్లో రుణాలు మంజూరు చేయించుకొని ఆ నగదుతో పరారయ్యారు. అయితే రుణాలు తీసుకున్న బ్యాంకులు నగదు కట్టాలని నోటీసులు జారీ చేయడంతో ప్రస్తుతం బాధితులంతా లబోదిబోమంటున్నారు. ఈ మోసం జరిగి నాలుగు నెలలు అవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆదర్శ పోలీసుస్టేషన్‌లో ఒక స్వతంత్ర బృందం కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ జ్యోతింద్ర నాథ్ పండా వెల్లడించారు.