కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని డైలీ మార్కెట్ వద్ద తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. బస్టాండ్ సమీపంలో రైతు బజార్ పేరిట ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. ఇదే ప్రధాన మార్కెట్ కావడంలో నిత్యం వందల సంఖ్యలో కొనుగోలుదారులు వస్తుంటారు. అంతేకాకుండా ఆంధ్ర, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, తెలంగాణల నుంచి అనేక వస్తువులు వస్తుంటాయి. ఇక్కడ నుంచి అనేక ఉత్పత్తులు వెళ్తుంటాయి. అటువంటి మార్కెట్‌లో పారిశుద్ధ్యం తీవ్రంగా లోపించింది. ఎక్కడికక్కడే మురికి కుంటలు ఏర్పడ్డాయి. వాటిని శుభ్రం చేసే నాథుడే కరువయ్యాడు. మురికికూపాల పక్కన గిరిజనులు తమ ఉత్పత్తులు విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజుకి రెండుసార్లు మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయాలి. కానీ అలా జరగడం లేదు. చేసేది ఏమీ లేక, చెప్తే వినేవారు లేక ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ద్వారం.. సుగంధ భరితం
భువనేశ్వర్: శ్రీ గుండిచా ఆలయం నక్కొచొణ ద్వారం శోభాయమానంగా సుగంధం విరజిమ్ముతోంది. మారు రథ యాత్ర (బహుడా) రోజున బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథునితో చక్ర రాజు సుదర్శనుడు మూల విరాట్ల ఈ ద్వారం గుండా వెలుపలికి విచ్చేస్తారు. యాత్రలో భాగంగా అడపా మండపంపై పూజలు అందుకున్న దేవతలు తిరిగి శ్రీ మందిరంలో రత్న వేదిక చేరేందుకు వరుస క్రమంలో (గొట్టి పొహండి) బయటకు తరలి వచ్చి రథాలపై ఆసీనులు అవుతారు. అనంతరం మారు యాత్రకు రథాలు బయల్దేరుతాయి. హీరా పంచమి రోజున శ్రీదేవి కూడా ఈ ద్వారం గుండా తిరిగి వస్తుంది. నక్కొచొణా ద్వారం పైభాగం మధ్యలో శ్రీ మహాలక్ష్మి ఉంటుంది. ద్వారం ఎడమ వైపున బ్రహ్మ, కుడి వైపున మహా దేవుడు ఉంటాడు. బ్రహ్మ మరియు శివుని పైన, నవ గ్రహాలు కూడా ఉంటాయి. బహుడా యాత్ర కోసం ఈ ద్వారం ముస్తాబు అవుతోంది. భారీ రంగవళ్లులతో యాత్ర శోభ రంగరించుకుంటుంది.
దివ్యాంగులకు వీల్‌చైర్ల
పంపిణీ
రాయగడ: జిల్లాలోని గుడారిలో కలెక్టర్ ఫరూల్ పట్వారీ ఆదేశాల మేరకు జిల్లా సామాజిక సురక్షా అధికారి రంజిత బెహర ఆధ్వర్యంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివ్యాంగులకు వీల్‌చైర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా వైద్యుల సమక్షంలో నిర్వహించిన పరీక్షల్లో వివిధ సమస్యలతో ఉన్న దివ్యాంగులకు గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా అందాల్సిన పథకాలు అందేలా పేర్లు నమోదు చేశారు. కార్యక్రమంలో పద్మపూర్ సామాజిక సురక్షా అధికారి సిగ్నమయి బారిక్, పీఏ మనోజ్ కుమార్ మిశాల్, అనీల్ గౌడొ తదితరులు పాల్గొన్నారు.
వెదజల్లుతున్న దుర్గంధం
వెదజల్లుతున్న దుర్గంధం