
పూరీ తొక్కిసలాట మృతులకు పరిహారం
భువనేశ్వర్: పూరీ రథయాత్రలో శారదా బాలి ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో మృతులకు ప్రకటించిన పరిహారం రాష్ట్ర మంత్రులు ప్రత్యక్షంగా అందజేస్తున్నారు. ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడా బుధవారం బలిపట్న మండలం ఒఠాంతొరొ గ్రామానికి చెందిన పార్వతి దాస్ కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కటుంబీకుల్ని ఓదార్చారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ. 25 లక్షల ఆర్థిక పరిహారం కుటుంబీకులకు అందజేశారు. విషాదం పట్ల వివచారం వ్యక్తం చేశారు.
ఆటోపై విరిగి పడిన చెట్టు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి రామగిరి సంతలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, గాలులు కారణంగా చెట్లు విరిగి అక్కడ ఉన్న ఆటోపై పడింది. మంగళవారం రామగిరి వారపు సంతకు పలువురు వ్యాపారులు, ప్రజలు వచ్చారు. కొంతమంది ఆటోలో తిరిగి తమ గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఒక మామిడి చెట్టు గాలికి అకస్మాత్తుగా విరిగి ఒక ఆటోపై పడింది. ఆ సమయంలో అందులో ఎవరూలేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రహదారిపై ఆ చెట్టు పడటం వలన దండాబెడ నుంచి బొయిపరిగులకు వాహనాల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి చెట్టును తొలగించి రోడ్డు క్లియర్ చేశారు.
తొక్కిసలాట దర్యాప్తు వేగవంతం
భువనేశ్వర్: పూరీ శారదా బాలి ప్రాంగణంలో తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్ దర్యాప్తు ప్రారంభించారు. నెల రోజుల్లోగా నివేదిక అందజేసేందుకు కమిషనర్‌తో పాటు నలుగురు ఓఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఎస్టేట్స్ జాయింట్ డైరెక్టర్, సాధారణ పాలన, ప్రజాభియోగాలు విభాగం అదనపు కార్యదర్శి మానస్ రంజన్ సామల్, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి బినయ కుమార్ దాష్, జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి రష్మి రంజన్ నాయక్, నిర్మాణ శాఖ అదనపు కార్యదర్శి ప్రదీప్ కుమార్ సాహూ ఉన్నారు. బినయ కుమార్ దాష్, రష్మి రంజన్ నాయక్, ప్రదీప్ కుమార్ సాహూ ప్రస్తుతం రథ యాత్ర కార్యకలాపాల పర్యవేక్షణ కోసం పూరీలో సేవలు అందిస్తున్నారు. సంబంధిత అధికారులు వారి సాధారణ, దైనందిన విధులతో పాటు దర్యాప్తు బాధ్యతలను చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిర్వాహకుల నిర్లక్ష్యం.. చెత్త కుప్పల్లో ప్రసాదం
రాయగడ: రథయాత్రలో భాగంగా ప్రభు జగన్నాథుని కిచుడి భోగం (ప్రసాదం)పొందేందకు గంటల తరబడి భక్తులు వేచి ఉంటారు. ఈ మహాప్రసాదానికి అంత పవిత్రత ఉంది. ఈ క్రమంలో స్థానిక గుండిచా మందిరంలో నిర్వాహకుల నిర్లక్ష్యం తాజాగా బయటపడింది. జగన్నాధుని మహాప్రసాదాన్ని చెత్తకుప్పల్లో పారబోయడం చర్చనీయాంశంగా మారింది. మహాప్రసాదం కోసం గంటల తరబడి వేచి ఉన్నా లభించక నిరాశతో వెనుతిరిగే భక్తులు ఇలా ప్రసాదాన్ని నిర్వాహకులు నేలపాలు చేస్తుండటంపై మండిపడుతున్నారు. ఒకవేళ మిగిలిపొతే సమీపంలోని నదిలో వేయకుండా చెత్తకుప్పల్లో పారబోయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ ప్రియదర్శని సిబ్బందిపై మండిపడ్డారు.

పూరీ తొక్కిసలాట మృతులకు పరిహారం

పూరీ తొక్కిసలాట మృతులకు పరిహారం