
విద్యుత్ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలి
భువనేశ్వర్: రాష్ట్రంలో కీలకమైన విద్యుత్ ప్రాజెక్టులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ పరిస్థితి పట్ల విద్యుత్‌శాఖ బాధ్యతలు వహిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ ప్రత్యక్షంగా చొరవ తీసుకున్నారు. ప్రాజెక్టులు నిర్వహిస్తున్న ఒడిశా పవర్ జనరేటింగ్ కార్పొరేషన్ (ఓపీజీసీ), ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఓహెచ్‌పీసీ) ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పురోగతిని సమీక్షించారు. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ ప్రాజెక్టుల్ని వేగవంతం పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి గల కారణాలు, పరిస్థితులను మంత్రి పరిశీలించి సమర్థవంతమైన పరిష్కారాలను రూపొందించాలని సీనియర్ అధికారులతో చర్చించారు. ఒడిశా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, స్థిరత్వాన్ని పెంచాలన్నారు. ఈ సమావేశంలో ఓపీజీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 2‘‘660 మెగా వాట్ మూడవ దశ విస్తరణ, 50 మెగా వాట్లు సౌర విద్యుత్ ప్రాజెక్టు, ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) యూనిట్, ఫ్లై యాష్ వినియోగం, ఖాళీ అయిన గనుల నిర్వహణ ప్రాజెక్టుల్ని సమీక్షించారు. ఓహెచ్ పీసీ చొరవతో కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో 600 మెగా వాట్ల ఎగువ ఇంద్రావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (కలహండి), 600 మెగా వాట్ల ఎగువ కోలాబ్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (కొరాపుట్), 500 మెగా వాట్ల బలిమెల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (మల్కన్‌గిరి), 63 మెగా వాట్ల ఖడగ్ హైడ్రో ప్రాజెక్ట్ (కంధమల్) ఉన్నాయి. నాణ్యతా ప్రమాణాలతో ఈ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు నిరంతరం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.