
భగ్గుమన్న అధికార వర్గం
● ముఖ్యమంత్రితో ముఖాముఖి భేటీ
● సామూహిక సెలవు హెచ్చరిక
భువనేశ్వర్: రాష్ట్రంలో పరిస్థితి అట్టుడికిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల మధ్య దూరం పెరుగుతోంది. భువనేశ్వర్ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉండగా దాడి చేయడంపై ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు (ఓఏఎస్) వర్గం తీవ్రంగా మండిపడుతుంది. ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టకుంటే సామూహిక సెలవు ఆందోళనకు దిగుతామని ముఖ్యమంత్రికి స్పష్టంగా చెప్పింది. ప్రజల పట్ల, ప్రజా ప్రతినిథుల పట్ల అధికారులు దురుసు, అసభ్య ప్రవర్తనపై ఏమాత్రం సహించేది లేదని, తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ పరిస్థితి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖపై విపరీత ప్రభావం చూపుతుంది. జాజ్‌పూర్ ప్రాంతంలో ఊహాతీత అతిసార తాండవం, పూరీలో కనీవినీ ఎరుగని రీతిలో తొక్కిసలాట మరణాలు, బలభద్ర స్వామి మూల విరాట్ బోర్లా పడడం వంటి తీవ్ర సంచలనాత్మక సంఘటనల నుంచి కోలుకోక ముందే విధి నిర్వహణలో ఉన్న భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌పై రాష్ట్ర బీజేపీ నాయకులు సోమవారం బాహాటంగా దాడి చేశారు. ఈ చర్యపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది.
ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు అసోసియేషన్ (ఓఏఎస్‌ఏ) ప్రతినిధులు రాత్రికి రాత్రి ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి, రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్, జంట నగరాల పోలీసు కమిషనరుతో అత్యవసరంగా సమావేశమయ్యారు. జరిగిన సంఘటనపై తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తక్షణ స్పందన ఆశిస్తున్నట్లు విన్నవించారు. తమ విన్నపంపై సత్వర చర్యలు చేపట్టకుంటే సామూహిక సెలవుతో అంతా కలిసికట్టుగా శాంతియుత ఆందోళనకు శంఖారావం చేస్తామని సున్నితంగా హెచ్చరించారు.
ముఖ్యమంత్రి బుజ్జగింపు
బాధిత అధికారుల వర్గం అభ్యర్థనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి స్పందించారు. నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 3 మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇతరుల కోసం గాలింపు కొనసాగుతోందని అన్నారు. చట్టం పట్ల గౌరవ భావంతో ప్రభుత్వ చట్టపరమైన చర్యలను విశ్వసించి సామూహిక సెలవులపై వెళ్లవద్దని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తికి బాధిత వర్గం పాక్షికంగా శాంతించింది. అయితే రాజీ కుదరలేదని ఆ వర్గం ముఖ్యమంత్రికి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఓఏఎస్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు సామూహిక సెలవు ఆందోళనని వాయిదా వేశారు. మరో వైపు అన్ని జిల్లా ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్లు (ఓఏఎస్‌ఏ) మంగళవారం సమావేశమై, సంఘటనను ఖండించి, రాష్ట్ర సంఘానికి తీర్మానాలను పంపాలని అభ్యర్థించారు. ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ చర్యల పట్ల ఐఏఎస్, ఓఎఫ్‌ఎస్, ఓఎస్‌ఎస్, ఓఆర్‌ఎస్ ఇతర సంఘాల సంఘీభావం ప్రకటించాయి.

భగ్గుమన్న అధికార వర్గం

భగ్గుమన్న అధికార వర్గం