
బీజేపీ నేత జగన్నాథ్‌ను అరెస్టు చేయాలి
భువనేశ్వర్: స్థానిక నగర పాలక సంస్థ (బీఎంసీ) అదనపు కమిషనర్ రత్నాకర్ సాహూ విధి నిర్వహణలో ఉండగా అవమానకర దాడిని ప్రేరేపించిన ప్రధాన సూత్రధారి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కార్యనిర్వాహఖ సభ్యుడు జగన్నాథ్ ప్రధాన్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి వినతిపత్రం బుధవారం అందజేశారు.
ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి
మల్కన్‌గిరి: కోరుకొండ సమితి మాటపాకా ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న రోహిత్ మడ్కమి (12) అనే విద్యార్థి బ్రెయిన్ మలేరియాతో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఇతని స్వగ్రామం శిఖాపల్లి పంచాయతీ ఊరమగుడ. హాస్టల్లో ఉండగా జ్వరం రావడంతో మల్కన్‌గిరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ రోహిత్ మృతిచెందాడు. సబ్ కలెక్టర్ దుర్యోధన్ పాత్రో ఈ ఘటనపై ఆరా తీశారు.
ఏసీపీ ప్రకటన రాజ్యాంగ విరుద్ధం
కొరాపుట్: ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తల కాళ్లు విరగ్గొట్టాలని, అలా చేస్తే రివార్డు ఇస్తానని భువనేశ్వర్ ఏసీపీ నర్సింగ బలో వ్యాఖ్యానించడం రాజ్యంగ విరుద్ధమని జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భువనేశ్వర్‌లో బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ దాడి చేస్తే ఎక్కడికు వెళ్లారని ప్రశ్నించారు. ఇలా దాడి చేస్తే వారి మీద 307 సెక్షన్ ఎందుకు పెట్టలేదన్నారు.
పూరీ మరణాలు కనిపించవా?
కొరాపుట్: పూరీ మరణాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముగ్గురు భక్తులు మరణించినందున ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు. ఇదే గుజరాత్ మోడల్ పాలన అని ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారని మండిపడ్డారు.
ఘనంగా వనమహోత్సవం
పర్లాకిమిడి: స్థానిక సరస్వతీ శిశు విద్యామందిర్‌లో వన మహోత్సవాలు సందర్భంగా ‘తల్లి కోసం ఒక మొక్కను నాటుదాం’అనే నినాదంతో జిల్లా స్కౌట్స్, గైడ్స్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ఉన్నత పాఠశాలల పీఈటీ ఇన్‌చార్జి సురేంద్ర కుమార్‌పాత్రో ముఖ్యఅతిథిగా విచ్చేసి శిశు విద్యామందిర్ ఆవరణలో విద్యార్థులతే మొక్కలను నాటించారు. కార్యక్రమంలో సరస్వతీ శిశు మందిర్ ప్రధాన ఆచార్యులు సరోజ్ కుమార్ పండా, జిల్లా వికాస్ సమితి కార్యకర్త అరుణ్‌కుమార్ భాగ్, కోశాధికారి ప్రమోద్ కుమార్ పాఢి, మనోజ్ కుమార్ దాస్, ప్రకాష్ చంద్ర త్రిపాఠి, సరోజ్ కుమార్ పట్నాయక్ పాల్గొన్నారు.
గొట్టా బ్యారేజీ నీరు విడుదల
హిరమండలం : ఖరీఫ్‌లో శివారు ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి గొట్టా బ్యారేజీ నుంచి ఎడమ ప్రధాన కాలువలోకి నీరు విడుదల చేశారు. అనంతరం గొట్టా బ్యారేజీ నీటి నిల్వ, ఔట్ ఫ్లో, ఇన్ ఫ్లో ప్రవాహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వంశధార అధికారులు మాట్లాడుతూ బ్యారేజీలో ప్రస్తుతం 38.1 మీటర్ల నీటిమట్టం ఉందన్నారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, వంశధార ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్లు ఎ.రవీంద్ర, ఒ.ఆనందరావు, వంశధార ఎస్‌ఈ స్వర్ణకుమార్, టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, ఈఈలు సీతారాంనాయుడు,శేఖర్ బాబు, డీఈఈలు బి.సరస్వతి, ధనుంజయరావు, ఏఈ పరిశుద్ధబాబు, సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు పొగిరి బుచ్చిబాబు, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు టి.తిరుపతిరావు, నాయకులు పి.శ్రీధర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ నేత జగన్నాథ్‌ను అరెస్టు చేయాలి