
బయటకు వచ్చిన రైల్వే ట్రాక్
కొరాపుట్: కొత్తవలస–కిరండోల్ రైల్వే మార్గంలో జయపూర్–కొరాపుట్ రైల్వే స్టేషన్ల మధ్య జర్తి–మాలిగూడ మధ్య కనుమరుగైన రైల్వే ట్రాక్ బయట పడింది. ఈ ప్రదేశంలో బుధవారం మట్టి, కొండ చరియలు వర్షం వల్ల ట్రాక్ మీదకు చొచ్చుకు వచ్చి న విషయం పాఠకులకు విధితమే. మూడు రోజులు గా రైల్వే సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడి ట్రాక్‌ని వెలికి తీశారు. ట్రాక్ మీద ఉన్న మట్టి,బండ రాళ్లని తొలగించారు. శుక్రవారం సాయంత్రం ట్రాక్ పూర్తిస్థాయిలో కనిపించింది. ట్రాక్ పటిష్టత పరిశీలన జరుగుతుంది. ఈ ఆపరేషన్‌లో 25 వేల క్యుబిక్ బురదని ట్రాక్ మీద నుంచి తొలగించారు. 16 హెవీ ఎర్త్ మూవర్స్ రాత్రింబవళ్లు పనిలో నిమగ్నమయ్యాయి. 300 మంది సిబ్బంది, కార్మికులు, టెక్నికల్ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు ప్రకటించారు. వాల్తేర్ డీఆర్‌ఎం లలిత్ బోరా, రాయగడ డీఆర్‌ఎం అమితాబ్ సింఘల్ ప్రత్యక్ష పర్యవేక్షణ చేశారు. ఈస్ట్ కోస్ట్ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంకువాల్ ఈ ట్రాక్ పునరుద్ధరణతో హర్షం వ్యక్తం చేశారు.
కొరాపుట్ నుంచి యథావిధిగా రైళ్లు
కొరాపుట్ నుంచి రైళ్లు యథావిధిగా నడుస్తాయి. కొరాపుట్–కోల్‌కత, కొరాపుట్–భువనేశ్వర్, కొరాపుట్–విశాఖ పట్నంలో రైళ్ల రాకపోకల్లో మార్పేమి లేదు. అన్ని రైళ్లు ఈ మార్గంలో నడుస్తున్నాయి. ఇక కిరండోల్–కొరాపుట్ మార్గంలో ట్రాక్ పటిష్టత పూర్తయిన తర్వాత రైళ్లు నడుస్తాయి.
రథయాత్ర ప్రత్యేక రైళ్లు రద్దు
పూరి రథయాత్ర కోసం జగదల్‌పూర్–పూరి, విశాఖ పట్నం–పూరికి ప్రత్యేక రైళ్లని రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కానీ వెళ్లాల్సిన రెండు ర్యాక్‌లలో ఒకటి కిరండోల్ దగ్గర ఒకటి,అంబుగాం దగ్గర మరోకటి ఉండి పోయాయి. ఈ రెండు ర్యాక్‌లు వెళ్లే లోపు ఇక్కడ ప్రమాదం జరి గింది. దీంతో శుక్ర వారం రైల్వే శాఖ ప్రత్యేక ప్రకటన చేసింది.ఈ నెల 5,7 తేదీల్లో జగదల్‌పూర్ నుంచి పూరీ వెళ్లాల్సిన రైళ్లు, 6న విశాఖ–పూరి, 7న పూరి–విశాఖ పట్నం ప్రత్యేక రథయాత్ర రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించింది.

బయటకు వచ్చిన రైల్వే ట్రాక్

బయటకు వచ్చిన రైల్వే ట్రాక్