
‘రాష్ట్రంలో భద్రత క్షీణిస్తోంది’
భువనేశ్వర్: రాష్ట్రంలో సాధారణ పౌరుడు మొదలుకొని ఉన్నత స్థాయి అధికారుల వరకు ఏ ఒక్కరికి భద్రత లేకుండా పోయింది. రాష్ట్రలో భద్రత, రక్షణ పూర్తిగా క్షీణించి పోయిందని పలు వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
గందరగోళ పరిస్థితి
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి గందరగోళంగా తయారైందని, విధి నిర్వహణలో ఉన్న స్థానిక నగర పాలక సంస్థ అదనపు కమిషనర్‌పై పట్టపగలు బాహాటంగా మారణాంతక దాడికి పాల్పడడం ఈ విచారకర పరిస్థితిని తేటతెల్లం చేసిందని నగర మేయర్ సులోచనా దాస్ ఘాటుగా స్పందించారు. నామ మాత్రంగా ముగ్గురు నిందితుల్ని మాత్రమే అరెస్టు చేశారని, ప్రధాన సూత్రధారి ముసుగు తొలగించి తెర పైకి తేవాలని ఆమె కోరారు.
రాష్ట్రంలో ఆటవిక పాలన: సోఫియా ఫిరదౌసి
రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని కటక్ నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే సోఫియా ఫిరదౌసి వ్యాఖ్యానించారు. పూరీ రథ యాత్ర తొక్కిసలాట సంఘటన, బీఎంసీ సంఘటన మాత్రమే కాదు, రాష్ట్రంలో సాధారణ శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా దిగజారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అధికారి అసభ్యంగా ప్రవర్తించారు:
జగన్నాథ్ ప్రధాన్
భువనేశ్వర్ నగర పాలక సంస్థ దాడి సంఘటనపై భారతీయ జనతా పార్టీ నాయకుడు జగన్నాథ్ ప్రధాన్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ రత్నాకర్ సాహు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించారు. స్వచ్ఛ సాథీ విషయమై ఫోన్ చేసిన సందర్భంలో నువ్వు ఎవరు, నన్ను ఎందుకు అడుగుతున్నావని అసభ్యంగా ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. ఈ స్పందనని సోషల్ మీడియాలో తన వ్యాఖ్యని ప్రసారం చేసినట్లు తెలిపారు.
విచారకర సంఘటన:
బిజయ్ కుమార్ పట్నాయక్
37 ఏళ్ల సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో ఇలాంటి విచారకర సంఘటనని చవి చూడలేదని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి బిజయ్ కుమార్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. బీఎంసీ అదనపు కమిషనర్‌పై జరిగిన దారుణమైన దాడిని చాలా భయంకరమైన సంఘటనగా అభివర్ణించారు.

‘రాష్ట్రంలో భద్రత క్షీణిస్తోంది’

‘రాష్ట్రంలో భద్రత క్షీణిస్తోంది’

‘రాష్ట్రంలో భద్రత క్షీణిస్తోంది’