రాయగడ: స్థానిక న్యూకాలనీ శ్రీరామలింగేశ్వర మందిరం ప్రాంగణంలో నిర్వహిస్తున్న రథయాత్రలో భాగంగా ఆలయ మండపంలో మంగళవారం అన్నమాచార్య సంకీర్తన మండలి వారు నిర్వహించిన భక్తి గీతాలపన కార్యక్రమం అలరించింది. కార్యక్రమంలో పి.కళ్యాణి, లాడి జయలక్ష్మి, కొత్తకొట శాంతి ప్రియ, గిరీష్ పట్నాయక్ తదితరులు అన్నమాచార్య కీర్తనలు, భక్తి గీతాలు ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.
తెలుగు మహిళల
విష్టు సహస్ర పారాయణం
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రానికి చెందిన తెలుగు మహిళలు విష్టు సహస్ర పారాయణం చేశారు. మంగళవారం సాయంత్రం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డు లో ఉన్న గుండిచా మందిరంలో పవిత్ర హిరా పంచమి సందర్భంగా సహస్ర పారాయణం పఠించారు. పట్టణానికి చెందిన తెలుగు ప్రజల ఆధ్యాత్మిక సంస్థ జ్యోతిర్మయి సంస్థ మహిళ సభ్యులు పారాయణం చేశారు. ఏటా హిరా పంచమి రోజున జ్యోతిర్మయి మహిళలు రథాయత్రలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 14న స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరు కానున్నారు. మర్నాడు 15న కటక్ నగరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. కటక్‌లోని రెవెన్షా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా రెవెన్షా బాలికల పాఠశాలకు శంకుస్థాపన చేస్తారు.
బీఎంసీ అధికారిపై దాడి: నాలుగో నిందితుడు అరెస్టు
భువనేశ్వర్:
స్థానిక నగర పాలక సంస్థ (బీఎంసీ) అదనపు కమిషనర్ రత్నాకర్ సాహుపై ఇటీవల జరిగిన దాడికి సంబంధించి నాలుగో నిందితునిగా ధ్రువీకరించి సచికాంత్ స్వంయిని మంగళ వారం అరెస్టు చేశారు. ఇంతకు ముందు ఈ సంఘటనలో ముగ్గురు నిందితులను జీవన్ రౌత్, రష్మి మహాపాత్ర మరియు దేబాషిస్ ప్రధాన్‌ను స్థానిక ఖారవేళ నగర్ ఠాణా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బాధిత అధికారి ఠాణాలో పోలీసులకు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగిపై తీవ్రమైన దాడి, నేరపూరిత కుట్ర, కిడ్నాప్ యత్నం, ప్రభుత్వ విధులకు ఆటంకం, ఉద్దేశ్యపూర్వక చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడడం నేరారోపణల కింద కేసులు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించారు. భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషను అధికారిపై దాడికి సంబంధించి దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు కార్యకర్తల వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ చర్యలు చేపట్టింది. స్థానిక కార్పొరేటర్‌తో సహా ఐదుగురు సభ్యులను సస్పెండ్ చేసింది. హింసాత్మక చర్యలకు పాల్పడడం దుష్ప్రవర్తనగా పేర్కొంటూ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సమల్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ సస్పెండు చేసిన వారిలో కార్పొరేటర్ అపురూప్ నారాయణ్ రౌత్, రష్మి రంజన్ మహా పాత్రో, దేబాషిస్ ప్రధాన్, సచికాంత్ స్వంయి, సంజీవ్ మిశ్రా ఉన్నారు. వీరందరి పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు.
అలరించిన భక్తి గీతాలాపన