
దేశాభివృద్ధిలో ఎన్‌సీసీ పాత్ర కీలకం
భువనేశ్వర్: క్రమశిక్షణ, వ్యక్తిత్వ నిర్మాణం, నిస్వార్థ సేవ దృక్పథంతో బాధ్యతాయుతమైన పౌరులను ఆవిష్కరించడంలో నేషనల్ క్యాడెట్ కార్‌ప్స్ (ఎన్‌సీసీ) శక్తివంతమైన యువ ఉద్యమని, ఈ రూపకల్పనలో నాయకత్వ లక్షణాలతో కూడిన బలమైన యువతరం వెలుగు చూస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. శనివారం స్థానిక ఓయూఏటీ ఆడిటోరియంలో రాష్ట్ర శాఖ ఎన్‌సీసీ డైరెక్టరేట్ నిర్వహించిన ఎన్‌సీసీ – ఏ ఫోర్స్ మల్టిప్లైయర్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనే రాష్ట్ర స్థాయి సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. జాతీయ భద్రత, సామాజిక, సాంస్కృతిక సహకారాలు, యువతరం పురోగతి, డిజిటల్ సాధనాలు, విధానాల వినియోగం తీరును వివరించారు. బలమైన సమైక్య దేశం నిర్మించడానికి ఎన్‌సీసీ దోహదపడుతుందన్నారు. సాయుధ దళాలతో యువత అనుసంధానం, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసం అంశాల్ని ఈ సదస్సు చర్చించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా, గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి యువత ప్రాధాన్యత, మహిళలకు సాధికారత కల్పించడంలో ఎన్‌సీసీ నిరంతరం కృషి చేస్తోందని ప్రశంసించారు. కార్యక్రమంలో సాయుధ దళాల అధికారులు, విద్యావేత్తలు, క్యాడెట్లు, అసోసియేట్ ఎన్‌సీసీ అధికారులు పాల్గొన్నారు.