
హత్యాయత్నం కేసులో నలుగురు అరెస్టు
జయపురం: ఒక యువకుడుని హత్య చేసేందుకు ప్రయత్నించిన కేసులో నలుగురిని అరెస్టు చేసినట్టు జయపురం పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంధ్ర రౌత్ శనివారం తెలిపారు. అరెస్టయినవారిలో క్రిష్టియన్‌పేటకు చెందిన ఆదిత్య ఖోశ్ల, రితేష్ ఘాఢ, కొత్తవీధికి చెందిన కిరణ్ ఖొర, గోపబంధునగర్‌కు చెందిన శివ నాయిక్ ఉన్నారన్నారు. వారి వద్ద నుంచి ఒక పదునైన కత్తి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం క్రిష్టియన్‌పేట బిజురాజ్‌నగర్ వాసి సమీర్ గుణియ బయటకు వెళ్లాడు. 26వ జాతీయ రహదారి లక్ష్మీ పండ కూడలి వద్ద అతను నిలబడి ఉండగా దుండగులు వచ్చి డబ్బులు అడిగారు. అతడు డబ్బులు ఇవ్వక పోవడంతో అతడిని దుర్భాషలాడి చంపుతామని బెదిరించారు. అతడు తిరగడబటంతో వారు సమీర్‌ను కత్తితో పొడిచారు. అతడి వద్దగల ఏడు వేల రూపాయలు, మొబైల్ ఫోనుతీసుకు పోయారని బాధితుడు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన సమీర్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. నిందితులు నలుగురిని గాలించి పట్టుకొని అరెస్టు చేశామన్నారు.