
ఫ్లై ఓవర్ నుంచి ట్యాంకర్ బోల్తా
రాయగడ: కొరాపుట్ నుంచి వస్తున్న ఒక భారీ ట్యాంకర్ స్థానిక ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి కింద అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో బ్రిడ్జి కింద చేపలు, కూరగాయాలు విక్రయించే వారుంటారు. మధ్యాహ్నం కావడంతో అంతా దుకాణాలను మూసివేసి వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. లేదంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగిందిలా..
కొరాపుట్ నుండి వస్తున్న భారీ ట్యాంకర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి మలుపు వద్ద అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఒక స్కూటీని ఢీకొంది. అతివేగంతో వస్తున్న ట్యాంకర్ వల్ల ప్రమాదం సంభవిస్తుందని ముందుగా పసిగట్టిన స్కూటీ డ్రైవరు తను నడుపుతున్న స్కూటీని విడిచి గెంతివేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. స్కూటీని సరాసరి ఢీకొన్నాక ట్యాంకర్ స్టీరింగ్ అదుపు తప్పడంతో బ్రిడ్జి మలుపు వద్ద సెక్యూరిటీ వాల్స్‌ను ఢీకొని సరాసరి 25 అడుగుల ఎత్తు నుంచి ట్యాంకర్ కింద పడింది. ప్రమాదం సంభవించిన వెంటనే డ్రైవరు సంఘటన స్థలం నుంచి పరారయ్యారు.
సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన సమాచారాన్ని తెలుసుకున్న సదరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి రాకపోకలు ఆపారు. బ్రిడ్జి కింద పడి ఉన్న ట్యాంకర్ వద్ద అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలను చేపట్టారు. ముందుగా ట్యాంకర్ కు సంబంధించిన డీజిల్ ట్యాంక్ నుండి డీజల్ కారుతుండటంతొ ఎలాంటి అగ్నిప్రమాదం సంభవించకుండా ట్యాంక్ నుంచి డీజిల్‌ను తీసివేశారు.
నిబంధనలకు తిలోదకాలు
నిత్యం జన సమూహంతో రద్దీగా ఉండే రాయగడ పట్టణంలో భారీ వాహనాలు లోపలకు ప్రవేశించకూడదని, బైపాస్ వైపు వాటిని మళ్లించాలని కలెక్టర్ ఫరూల్ పట్వారి గత కొద్ది రోజుల కిందట ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఈ చర్యలు చేపట్టారు. అయితే మిట్ట మధ్యాహ్నం భారీ వాహనం పట్టణం లోపలకు ఎలా ప్రవేశించిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ఏర్పాటు చేసిన వందకు పైగా ఉన్న నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) పర్యవేక్షిస్తున్న పోలీసులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం కలుగుతుందని కాంగ్రెస్ నాయకుడు భూషణ మాజి ఆరోపించారు.