
కార్యక్రమానికి హాజరైన తెలుగు, ఒడియా ప్రజలు
● ఉర్రూతలూగించిన టాలీవుడ్ గాయకుల గీతాలాపన ● ఉత్సవాల్లో పాల్గొన్న కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలక ● నెక్కంటికి అభిమానుల ఘన సన్మానం
రాయగడ:
పట్టణంలోని హోటల్ తేజస్వి మైదానంలో రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు ఆధ్వర్యంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ఉగా ది సంబరాలు గురువారం రాత్రి ముగిసాయి. ఇందు లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమా లు ఆహుతులను అలరించాయి. ఉత్సవాల్లో పాల్గొ న్న కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర ఉలక తెలుగులో కొద్దిసేపు మాట్లాడారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు, ఒడియా ప్రజలు సమైఖ్యతగా పండగలను జరుపుకొని, ఒకరికొకరు ఆహ్వానించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అదే సంప్రదాయం కొనసాగేలా ఈ ఏడాది సంబరాలు నిర్వహించారని అభినందించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతీ పండగను సంయుక్తంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
నెక్కంటికి సత్కారం..
తెలుగు భాషా, సంస్కృతి పరిరక్షణ కోసం కృషి చేస్తూ అందరినీ కలుపుకునే విధంగా ఏటా ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నడుం బిగిస్తున్న రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్క రరావు దంపతులను ఉత్సవ వేదికపై అభిమానులు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఇంతగా అభిమానించ డం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. గత పదేళ్లుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది మరింత విజయవంతం కావడానికి అందరి ఆదరాభిమానాలు, సహాయ, సహాకారాలే కారణమని వివరించారు. ఇకపై కూడా ఈ తరహా సంప్రదాయాల ను కొనసాగేలా తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు.
ఉర్రూతలూగించిన గాయకులు..
ఉగాది ముగింపు కార్యక్రమంలో టాలీవుడ్ నేపథ్య గాయకులు ఎస్పీ చరణ్, కల్పన, అదితి భవరాజు, ఇండియన్ ఐడిల్ సింగర్ జయంత్ పాల్గొన్నారు. ముందుగా ఎస్పీ చరణ్ వినాయక ప్రార్థన గీతంతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారభించారు. అనంతరం ప్రజల కోరిక మేరకు పలు పాటలను పాడి వినిపించారు. పాటల రాక్షసిగా గుర్తింపు పొందిన సింగర్ కల్పన ప్రేక్షకులను ఉర్రూతలూగించే విధంగా గీతాలను ఆలపించారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు ఇమిటేషన్ రాజు పలువురి కథానాయకుల గళంతో నిర్వహించిన మిమికీ రంజింపజేసింది. అదితి భవరాజు, జయంత్ కొత్త సినీ పాటలు పాడి వినిపించారు. ప్రముఖ యాంకర్ శ్యామల వ్యాఖ్యాతగా నిలిచారు.
విజేతలకు బహుమతుల ప్రదానం..
ఉగాది సందర్భంగా పట్టణంలోని పలువురు ప్రముఖులను ఉగాది ఉత్సవ కమిటీ ఘనంగా సన్మానించింది. స్థానిక వేద పండితులు రేజేటి శ్రీనివాస్‌శర్మ దంపతులను శాలువా కప్పి సన్మానించారు. పట్టణ ప్రముఖులు చంద్రమౌళి కుముందాన్ దంపతులు, రాఘవ కుముందాన్, సిల్లా జగన్నాథ స్వామి తదిత రులు రేజేటికి బంగారు కంకణంతో ఘనంగా సత్కరించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రంగవళ్లులు, మెహందీ, వన్ మినిట్ షో, ఉగాది క్వీన్, డ్యాన్స్ బేబి డ్యాన్స్ తదితర పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి వేదికపై బహుమతులను అందజేశారు. ఉత్సవాలను వేలాది మంది తరలివచ్చి, వీక్షించారు.
రెండు వేదికలపై..
ఈ ఏడాది రాయగడలో 2 వేదికలపై ఉగాది ఉత్సవా లు జరగడం కొసమెరుపు. నెక్కంటి భాస్కరరావు ఆధ్వర్యంలో స్థానిక తేజస్వి మైదానంలో ఒక వేదిక రూపుదిద్దుకుంటే, జేకే రోడ్డు హీరో షోరూం సమీపంలోని మైదానంలో ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో మరో వేదిక ఏర్పాటైంది. దీనికి ఎల్ల వేంకటేశ్వరరావు(కొండబాబు) నేతృత్వం వహించారు. ముందుగా అనుకున్నట్లుగానే 2 ఉగాది వేడుకలు నిర్వహించడం నువ్వానేనా అన్నట్లు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో 2 వేదికలకు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

నెక్కంటిని సన్మానిస్తున్న అభిమానులు

ఇమిటేషన్ రాజు షో

గీతాలాపనలో సింగర్ కల్పన