
ఏహెచ్‌టీయూ పోలీసుల సమక్షంలో బాలుడిని తల్లి చెంతకు చేర్చిన ఎస్పీ రాధిక
శ్రీకాకుళం క్రైమ్: రెండేళ్ల కిందట తల్లి నుంచి దూరమైన బిడ్డ మళ్లీ తల్లి పొత్తిళ్లకు చేరాడు. పోలీసుల కృషి, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం సిబ్బంది చొరవ ఈ తల్లీబిడ్డలను కలిపింది. రెండేళ్ల కిందట బిడ్డను పోషించలేని స్థితిలో తల్లి వెళ్లిపోతే.. ఆ పసివాడిని ఆశ వర్కర్లు శ్రీకాకుళంలోని శిశుగృహలో చేర్పించారు. ఆ బాలుడిని శిశుగృహ సిబ్బంది కంటికి రెప్పలా కాచుకున్నారు. అయితే అనాథ బాలలను అయిన వారికి చేర్చే కార్యక్రమం చేపడుతున్న మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం సిబ్బంది ఈ బాలుడిని తల్లి చెంతకు చేర్చాలని తలచారు. ఇందుకోసం పోలీసుల సాయం తీసుకున్నారు. ఆ బాలుడి తల్లి మచిలీపట్నంలోని చిలకపూడి గ్రామంలో ఉన్నట్లు గుర్తించి.. జిల్లా బాలల సంక్షేమ సమితి సూచనల మేరకు బిడ్డను తల్లికి అప్పగించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం శ్రీకాకుళం మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసుల సమక్షంలో ఎస్పీ జీఆర్ రాధిక బిడ్డను తల్లి చెంతకు చేర్చారు. ఎస్పీ మాట్లాడుతూ బాలుడికి ఉన్నత విద్య అందించాలని, మంచి ప్రయోజకుడిని చేయాలని సూచించారు. బాలుడిని తల్లి వద్దకు చేర్చడంలో కృషి చేసిన ఏహెచ్‌టీయూ విభాగం పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టీపీ విఠలేశ్వరరావు, ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ కేశవరావు, సిబ్బంది పాల్గొన్నారు.