
కేజీబీవీ సారవకోట
సద్వినియోగం చేసుకోండి
కేజీబీవీల్లో ప్రవేశాలకు ప్రభు త్వం నోటిఫికేషన్ వెలువరించింది. ఇందులో బాలికలు చదువుకోవడం గొప్ప అవకాశం. ప్రభుత్వం నిర్దేశించిన విధివిధానాల ప్రకారం ఈనెల 27 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. 7, 8, 9 తరగతుల్లో మిగులు సీట్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతాం.
– డాక్టర్ రోణంకి జయప్రకాష్, సమగ్ర శిక్ష అదనపు జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (ఏపీసీ)
శ్రీకాకుళం న్యూకాలనీ: కసూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రవేశాలకు వేళయింది. 2022–23 విద్యా సంవత్సరానికిగాను కేజీబీవీల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించింది. ఈనెల 27వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన బాలికలు 6వ తరగతిలో ప్రవేశాలు పొందవచ్చు.
26 కేజీబీవీలు.. 1040 సీట్లు
పునర్విభజన అనంతరం 30 మండలాల శ్రీకాకుళం జిల్లాలో 26 కేజీబీవీలు ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగే ఈ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఒక్కో పాఠశాలలో 40 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ లెక్కన 1040 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను సైతం భర్తీ చేస్తారు. పేద, అనాథ పిల్లలతో పాటు బడిబయట ఉన్న పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసినవారు), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీ ఎల్ బాలికలు మాత్రమే అర్హులు. 6వ తరగతిలో ప్రవేశం కోసం ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదివిన బాలికలై ఉండాలి. ఈ నెల 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్‌టీటీపీ://ఏపీకేజీబీవీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్// వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు పూర్తిచేయాల్సి ఉంటుంది. కేజీబీవీల్లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నా యి. 2018 నుంచి ఇంటర్మీడియెట్ కోర్సులను కూ డా అందిస్తున్నారు. జిల్లాలో మొత్తం 21 కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ కోర్సులు అందుబాటులో ఉన్నా యి. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని కేజీబీవీల్లోను వివిధ ఇంటర్ కోర్సులను ప్రవేశపెట్టారు. విద్యాలయాల్లో పూర్తిస్థాయి భద్రత ఉంటుంది. ఉపాధ్యాయులు (టీజీటీ/ పీజీటీలు) సైతం మహిళలే. రూపాయి ఖర్చు లేకుండా అత్యుత్తమ బోధన, నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలతో కేజీబీవీల్లో సీట్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 27 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
ఏప్రిల్ 20 వరకు అవకాశం
30 మండలాల పరిధిలో 26 కేజీబీవీల్లో 1040 సీట్లు భర్తీ
హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు..
కేజీబీవీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమయంలో ఏర్పడిన సందేహాలు, సమస్యల నివృత్తి కోసం అధికారులు జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఫోన్ నంబర్ 89192 61518ను సంప్రదించవచ్చని ఏపీసీ జయప్రకాష్ చెబుతున్నారు.
