
ఉపాధి వేతనదారులను పరామర్శిస్తున్న అధికారులు
వృద్ధురాలి ఆత్మహత్య
సారవకోట: మండలంలో బద్రి గ్రామానికి చెందిన మొయ్యి శిమ్మప్ప (77) గురువారం సూపర్ వాస్మల్ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శిమ్మప్ప సూపర్‌వాస్మల్ తాగడంతో కుటుంబ సభ్యులు గమనించి బుడితి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి 108 వాహనంలో శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. మృతురాలి సోదరుడు పంగ జోగులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని వ్యక్తి దుర్మరణం
గార: కళింగపట్నం సచివాలయం ఎదురుగా బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కళింగపట్నం పంచాయతీ సిలగాం కాలనీకి చెందిన గేదెల శ్రీను (36) కళింగపట్నం నుంచి ఇంటికి బైక్‌పై వస్తుండగా, సచివాలయం వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టా రు. తీవ్ర గాయాలు కావడంతో మృతిచెందాడు. శ్రీనుకు ఇద్దరు కుమారులున్నారు. ఎస్‌ఐ ఎం.మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్‌ను ఢీకొట్టిన కారు
కోటబొమ్మాళి: మండలంలోని నారాయణవలస పశువుల సంత వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. జలుమూరు మండలం పెద్దదూగాం, చిన్నదూగాం, రావిపాడు గ్రామాలకు చెందిన దుంగ ఆదినారాయణ, మూకళ్ల లక్ష్మీనారాయణ, కింజరావు శ్రీను కలిపి బైక్‌పై సంతకు వస్తుండగా వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ కాలు విరిగిపోగా చికిత్సనిమిత్తం శ్రీకాకుళంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన మిగిలిన ఇద్దరినీ నరసన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ షేక్ మహ్మద్ అలీ తెలిపారు.
ఇటుకలు కాల్చుతుండగా దంపతులకు గాయాలు
మెళియాపుట్టి: ఇంటి కోసం ఇటుకలు తయారు చేస్తుండగా జరిగిన అగ్ని ప్రమాదంలో గిరిజన దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. మెళియాపుట్టి ఎస్‌ఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గొట్టిపల్లి పంచాయతీ చందనగిరి గ్రామానికి చెందిన భార్యాభర్తలు కేదారి ఆదినారాయణ, సుశీల గృహ నిర్మాణం కోసం ఇటీవల ఇటుకల నిర్మాణం చేపట్టారు. వర్షాలకు వాటిని కాల్చకుండా పరదాలతో కప్పి ఉంచారు. గురువారం మధ్యాహ్నం ఇటుక బట్టీని కాల్చడానికి వెళ్లారు. కొంచెం చెమ్మగా ఉందని పెట్రోల్‌పోసి నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కాళ్లు చేతులు కాలిపోయి గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
బైక్ ఢీకొని ఇద్దరికి గాయాలు
మెళియాపుట్టి: మండలకేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న జలకలింగుపురం సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. టెక్కలి గ్రామానికి చెందిన నరసింహమూర్తి ద్విచక్ర వాహనంపై టెక్కలి వైపు వెళ్తూ.. జలకలింగుపురం వద్ద బహిర్భూమికి నడిచి వెళ్తున్న అదే గ్రామానికి చెందిన సవరయ్యను అదుపు తప్పి ఢీకొన్నాడు. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడటంతో స్థానికులు 108 ద్వారా టెక్కలి ఆసుపత్రికి తరలించారు.
కందిరీగల దాడిలో 25 మందికి గాయాలు
కోటబొమ్మాళి: మండలంలోని యలమంచిలి పంచాయతీ పరిధిలో కిల్లివానిచెరువులో గురువారం ఉపాధి పనులు చేస్తున్న 25 మంది వేతనదారులపై కందిరీగలు దాడిచేసి గాయపరిచాయి. పనులు నిర్వహిస్తుండగా చెరువు సమీపంలోని ముళ్లపొదల్లో కందిరీగలు ఒక్కసారిగా దాడిచేసి తల,శరీరంపైనా కుట్టడంతో వేతనదారులు రక్షంచుకునేందుకు పరుగులుతీశారు. ఈ ఘటనలో వై.దాలయ్య, హెచ్.రాజారావు, కె.రేవతి, అల్లబోయిన నాగమణి, కవిటి లక్ష్మి, కూన ఢిల్లేశ్వరరావు, ఆర్.రమణమూర్తి, ఎస్.అచ్చెయ్య, కె.నీలాచలం తదితరులను బలంగా కుట్టడంతో బొబ్బర్లువచ్చాయి. వెంటనే వీరిని ఫీల్డ్ అసిస్టెంట్ కవిటి అరుణకుమారి చికిత్స నిమిత్తం కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఎంపీడీఓ కె.ఫణీంద్రకుమార్, ఏపీఓ అరుణ్‌కుమార్ బాధితులను పరామర్శించారు.
కళింగపట్నంలో విషాదఛాయలు
గార: కళింగపట్నానికి చెందిన ఇద్దరు యువకులు విశాఖపట్నం వెళ్తుండగా ఆనందపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పట్నాన సంతోష్ హార్డువేర్ దుకాణం నడుపుతుండగా, లాడే దుర్గాప్రసాద్ హిందుస్థాన్ పరిశ్రమ సేల్స్ అధికారిగా పనిచేస్తున్నారు. ఇద్దరూ ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విశాఖపట్నం కేజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం రెండు మృతదేహాలు గురువారం సాయంత్రం కళింగపట్నం చేరుకున్నాయి.

టెక్కలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆదినారాయణ
