శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఏడో రోజు గురువారం సెట్–3 ప్రశ్న పత్రంతో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు మ్యాథ్స్–1(బి)పేపర్, జువాలజీ పేపర్–1, హిస్టరీ పేపర్–1కు పరీ క్షలు రాశారు. జిల్లా వ్యాప్తంగా 109 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పరీక్షల్లో భాగంగా మొత్తం 27,111 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా (95.595 శాతం హాజరు) 25,917 మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 1194 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారి కె.ప్రకాశరావు, ఆర్‌ఐఓ ఎస్.తవిటినాయుడు, డీఈసీ సభ్యులు, హైపవర్ కమిటి, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు వేరువేరుగా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.