భోగాపురం: భోగాపురంలో అంతర్జాతీయ విమాశ్రయ నిర్మాణంలో భాంగగా గృహాలు కోల్పోయిన బొల్లింకలపాలెం, ముడసర్లపేట, రెల్లిపేట, మరడపాలెం గ్రామాలకు చెందిన సుమారు 376 కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. గూడెపువలస, పోలిపల్లి రెవిన్యూ పరిఽధిలో సువిశాలమైన 5 సెంట్లు భూమితో పాటు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.9.20 లక్షలు అందజేసింది. నిర్వాసిత కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అయితే, స్థానిక వైస్సార్‌సీపీ నాయకులు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ 2013 చట్టం ప్రకారం 2015 నాటికి గృహాలు కోల్పోయిన వారి కుటుంబంలో18 ఏళ్లు నిండిన వారికి వర్తింపజేసి, నష్ట పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ బొల్లింకలపాలెం, రెల్లిపేట, ముడసర్లపేట, మరడపాలెం గ్రామాలకు చెందిన మొత్తం 28 నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీతో పాటు 5 సెంట్లు ఇళ్ల స్థలాలను మంజూరుచేస్తూ సోమవారం ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులతో పాటు విమానాశ్రయ నిర్వాసిత గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.