
నవరంగపూర్ జిల్లా మండోడోంగ్రి గ్రామంలో వీకే పాండ్యన్ పాదాలు కడుగుతున్న గ్రామస్తులు
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 5టీ(ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ఇన్సియేటివ్స్) కార్యదర్శి వీకే పాండ్యన్ వివాదంలో చిక్కుకున్నారు. గత 2రోజులు ఆయన.. నవరంగపూర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం కావడం దుమారం రేగింది. నవరంగపూర్ మండలం మండోడోంగ్రి గ్రామం సందర్శన పురస్కరించుకుని స్వాగతించిన సందర్భంలో ఆయన పాదాలను గ్రామస్తులు కడగడం వివాదాస్పదమైంది. పెద్దలకు పాదాలు కడిగి, గౌరవ పూర్వకంగా ఆహ్వానించడం కొన్ని ప్రాంతాల్లో సనాతన ధర్మంగా భావించే ఆచారం మనుగడలో ఉంది. అయితే పాండ్యన్ ప్రభుత్వ అధికారిక పర్యటనలో ఉండగా ఇలా సేవలు పొందడం అహేతుకమని వాదన బలం పుంజుకుంటోంది. ఇది ప్రజాసేవ తత్వం ఉల్లంఘనగా విచక్షణ వర్గం అభిప్రాయపడుతోంది. ఈ పరిస్థితిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ల ప్రవర్తనా నిబంధనలను జారీ చేసి, సంస్కరణలు చేపట్టాల్సి ఉందని భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ప్రసన్న మిశ్రా అభిప్రాయం వ్యక్తంచేశారు.