
అల్లూరి పోరాట పటిమ స్ఫూర్తిదాయకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ స్ఫూర్తి దాయకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. అల్లూరి 128వ జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన్యం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా బ్రిటీషు వారిపై ఆయన చేసిన పోరాటం, త్యాగం ఎప్పటికీ చిర స్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. సమాజానికి ఆయన అందించిన స్ఫూర్తి మార్గంలో పయనిస్తూ.. భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. దేశ స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అన్నారు. 27 ఏళ్ల వయసులోనే చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యాన్ని ఢీకొని వీర మరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎస్. శ్రీనివాసరెడ్డి, సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గాప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి డి.ఎంఎఫ్ విజయకుమారి, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్.వి.మోహన్‌రావు, డివిజనల్ పీఆర్వో కె. రవి, కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు.
కలెక్టర్ జి.లక్ష్మీశ