
జగజ్జననికి జేజేలు
భక్తజనసంద్రమైన ఇంద్రకీలాద్రి
అమ్మవారికి సారె సమర్పించిన భక్తులు, అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించే భక్తులతో పాటు కొండ దిగువకు చేరుకునే భక్తులు మహా మండపం మెట్ల మార్గం ద్వారానే దిగువకు చేరుకోవాల్సి వస్తోంది. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు మహా మండపం మెట్ల మార్గంలో అడుగు తీసి అడుగు ముందుకు వేసే పరిస్థితి కనిపించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ దశలో మెట్లపై నడుచుకుంటూ వెళ్తున్న వారు ముందుకు పడిపోయేలా తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. మెట్లపై నుంచి కిందకు దిగాలంటే కనీసం అరగంటకు పైగా సమయం పడుతుందని వారు ఆవేదన చెందుతున్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధికి ఆదివారం రికార్డు స్థాయిలో భక్తబృందాలు, భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఆదివారం, తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్నడూ లేని విధంగా ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు సారె సమర్పించేందుకు బారులు తీరారు. సాయంత్రం 8 గంటల వరకు భక్తులు సారె సమర్పిస్తూనే ఉన్నారు. ఒక్క రోజే సుమారు 15 గంటల పాటు ఏకధాటిన భక్తులు బృందాలుగా తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. మరో వైపున గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 70వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్‌మార్ డప్పులతో కుటుంబాలకు కుటుంబాలు ఇంద్రకీలాద్రికి పయనమయ్యాయి. భక్త బృందాలతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఓ దశలో అమ్మవారి దర్శనానికి, సారెను సమర్పించేందుకు వేచి ఉన్న భక్తులతో లక్ష్మీ గణపతి ప్రాంగణం పూర్తిగా నిండిపోగా, క్యూలైన్లు ఓం టర్నింగ్‌లోని దేవస్థాన బస్సు పాయింట్ వరకు చేరింది. దిగువ నుంచి బస్సులో కొండపైకి చేరుకున్న భక్తులు బస్సు దిగిన వెంటనే క్యూలో నిల్చోవడం కనిపించింది.
సర్వ దర్శనానికి మూడు గంటలు
భక్తుల రద్దీతో అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. ఉదయం నుంచి భక్తుల తాకిడి కనిపించడంతో అంతరాలయ దర్శనాన్ని ఆలయ ఈవో శీనానాయక్ రద్దు చేశారు. దీంతో రూ.300, రూ.100 టికెట్లను మాత్రమే విక్రయించారు. ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. మహామండపం లిఫ్టు మార్గం ద్వారా విచ్చేసిన భక్తులను 5వ అంతస్తు వరకే అనుమతించారు. దీంతో 5వ అంతస్తు వరకు క్యూలైన్ కిటకిటలాడుతూ కనిపించింది. సర్వ దర్శనానికి మూడు గంటలు పట్టగా, టికెట్‌పై రెండు గంటల సమయం పట్టింది.
మహామండపం మెట్ల మార్గంలో రద్దీ
ఏకాదశిన దుర్గమ్మకు
రికార్డు స్థాయిలో సారె
ఏకధాటిన 15 గంటలపాటు
కొనసాగిన సమర్పణలు

జగజ్జననికి జేజేలు