
భవానీ ద్వీపం పునర్వైభవానికి కృషి
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి పలు పర్యాటక ప్రాజక్ట్‌లను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. అందులో భాగంగానే భవానీ ద్వీపం పునర్వైభవానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో టూరిజం కొత్త సర్క్యూట్లపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఆయన భవానీ ద్వీపాన్ని సందర్శించి సెల్ఫీ పాయింట్లు, మేజ్ గార్డెన్, బోటింగ్ పాయింట్లు తదితరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విజయవాడ అర్బన్ పరిధిలో గాంధీహిల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం, బాపూ మ్యూజియం, మొగల్‌రాజపురం గుహలు, అక్కన్న–మాదన్న గుహలు వంటివి అనేక సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయని వివరించారు. అలాగే మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొండపల్లి ఖిల్లాను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
టెంపుల్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు
జిల్లాలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయని, కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు నగరానికి వచ్చే లక్షలాది మంది భక్తులు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి మధురానుభూతులతో తిరిగి వెళ్లేలా టూరిజం సర్క్యూట్లను అందుబాటులోకి తీసుకురానున్నామని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. వచ్చే దసరా ఉత్సవాల్లో విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్, ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ పి. కృష్ణచైతన్య, బెరంపార్క్, భవానీ ఐలాండ్ మేనేజర్లు శ్రీనివాస్, సుధీర్, కొల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ