
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ, బీఆర్‌ఎస్
● పాత డిజైన్ ప్రకారమే
‘మంచిప్ప’ పనులు
● ‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్
అభ్యర్థులను గెలిపించాలి
● నిజామాబాద్ రూరల్
ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి
మోపాల్(నిజామాబాద్‌రూరల్): బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు కలిసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి విమర్శించారు. శుక్రవారం మండలంలోని కంజర్, కులాస్‌పూర్, చిన్నాపూర్, బాడ్సి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు, శివాలయం ప్రహరీకి భూమిపూజ చేశారు. అంగన్‌వాడీ భవనాలు, ఆరోగ్య సబ్‌సెంటర్లు, బాడ్సిలో సొసైటీ గోదాం, కార్యాలయం, సీసీ రోడ్లు ప్రారంభోత్సవాలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, లబ్ధిదారులకు మంజూరుపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనకు, కాంగ్రెస్ 18 నెలల పాలన గురించి ప్రజలు బేరీజు చేసుకోవాలని సూచించారు.విడతలవారీగా కులసంఘాలకు నిధులు కేటాయిస్తామని, గ్రామాల అభివృద్ధి బాధ్యత తనదేనని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కవిత ఇప్పుడు బీసీల కోసం ఉద్యమిస్తుందని, పదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రాణహిత–చేవెళ్ల పథకంలో భాగంగా మంచిప్ప వద్ద పాత డిజైన్ ప్రకారమే పనులు కొనసాగేలా త్వరలో జీవో విడుదల అవుతుందని, ప్రతి గుంటకు నీరందిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు.
మనం రామభక్తులం.. బీజేపీ వాళ్లు మోదీ భక్తులు..
బీజేపీ వారు మోదీ భక్తులని, మనమంతా రామభక్తులమని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. పన్నులరూపేణ తెలంగాణ నుంచి రూపాయి చెల్లిస్తే.. కేంద్రం తిరిగి కేవలం 42పైసలు మాత్రమే ఇస్తుందని, మిగతా డబ్బులు యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలకు తరలిస్తుందని ఆరోపించారు. బీజేపీ ఎంపీలు గుజరాత్‌కు గులాంగిరి చేస్తున్నారని, కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. కార్యక్రమాల్లో నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, మండల అధ్యక్షుడు ఎల్లోల్ల సాయిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్ గోర్కంటి లింగన్న, బాడ్సి సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, డీసీఓ శ్రీనివాస్‌రావు, డీసీసీబీ డీజీఎం లింబాద్రి, నాయకులు గంగాప్రసాద్, ప్రతాప్, మహిపాల్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, గంగారెడ్డి, దిలావర్ హుస్సేన్, సాయన్న, రవి, పోశెట్టి, మల్లయ్య, జగదీశ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుంది
నిజామాబాద్‌నాగారం: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. కంఠేశ్వర్ బైపాస్ వద్దగల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్‌కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా పీడీ, పీఈటీ అసోసియేషన్ వైస్ చైర్మన్ బొబ్బిలి నర్సయ్య , అధ్యక్షులు నాంచారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్యదర్శి రంగు కృష్ణంరాజు, ట్రెజరర్ గణేష్ నిజామాబాద్ ప్రైవేట్ పీఈటీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అజ్మత్ ప్రశాంత్ , పీఈటీ, పీడీ అసోసియేషన్ ఉపాధ్యక్షు లు నరేంద్రచారి, కార్యదర్శులు పాల్గొన్నారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ, బీఆర్‌ఎస్