
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు
నిజామాబాద్‌అర్బన్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమీక్షాసమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఎందుకు జాప్యం జరుగుతోందని, ప్రధాన సమస్యలు ఏమిటని అధికారులను మహేశ్‌కుమార్‌గౌడ్ అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర వివరాలు తెలుసుకున్నారు. పారాబాయిల్డ్ రైస్ శాతాన్ని పెంచే విధంగా రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, సీపీ సాయిచైతన్య, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు
8.01లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
● రూ.1,604 కోట్లు రైతుల
ఖాతాల్లో జమ
సుభాష్‌నగర్: జిల్లాలో యాసంగి సీజన్‌లో 601 కొను గోలు కేంద్రాల ద్వా రా 93,974 మంది రైతుల నుంచి 8.01 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి (డీఎస్‌వో) అరవింద్‌రెడ్డి శనివారం తెలిపారు. 7.15లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకా లు కాగా, 85,739 మెట్రిక్ టన్నులు దొడ్డురకాలను సేకరించామని వివరించారు. రూ.1867.64 కోట్ల విలువైన ధాన్యాన్ని కేంద్రాల ద్వారా సేకరించామని, 86,339 మంది రైతుల ఖాతాల్లో రూ.1604 కోట్లు జమ చేశామన్నారు. చివరి గింజ వరకూ ధాన్యం సేకరించాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఆ మేరకు అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ పర్యవేక్షణలో కొనుగోళ్లు చేపడుతున్నామని తెలి పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించి బోనస్ డబ్బులు త్వరలోనే జమవుతాయని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.
గుండెపోటుతో
16ఏళ్ల బాలుడు మృతి
డొంకేశ్వర్(ఆర్మూర్): గుండెపోటుతో పదహారేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన డొంకేశ్వర్ మండలం నికాల్‌పూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వడ్ల శివ ఇటీవల స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి గ్రేడ్–ఏ ఉత్తీర్ణత సాధించాడు. తండ్రి గంగన్న చిన్నతనంలోనే చనిపోగా తల్లి సరిత కూలీ పనులు చేస్తూ కొడుకును పోషిస్తోంది. పేద కుటుంబ కావడంతో బాగా చదివి కుటుంబానికి అండగా ఉండాలని శివ అనుకునేవాడు. గ్రామంలోనే పని చేస్తూ చదువుకునేవాడు. శనివారం ఉదయం తీవ్రమైన దగ్గు కారణంగా శివ గుండెపోటుకు గురయ్యాడు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. దీంతో తల్లి సరిత గుండెలవిసేలా రోదించింది. బాలుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, యువకులు విరాళాలు పోగుచేసి బాధిత కుటుంబానికి రూ.లక్ష వరకు అందజేశారు.

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు