
ఉసురుతీసిన ఆన్‌లైన్ గేమ్
● రాయకూర్‌లో యువకుడి ఆత్మహత్య
రుద్రూర్: ఆన్‌లైన్ గేమ్ కు అలవాటుపడ్డ యు వకుడు డబ్బులు పో వడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని రాయకూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయకూర్ గ్రామానికి చెందిన మాగిరి గంగాధర్ (20) కొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నాడు. డబ్బులు లేకపోవడంతో తండ్రి ఫోన్‌లో నుంచి రూ. 5 వేలు తన ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకొని గేమ్ ఆడి పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన గంగాధర్ మంగళవారం రాత్రి పాడుబడ్డ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు వెతుకుతుండగా బుధవారం ఉదయం మృతదేహం కనిపించింది. మృతుడి తండ్రి పోశెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
తండ్రి మందలించాడని..
డిచ్‌పల్లి: పని చేయాలనీ లేదా చదువుకోవాలని తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి శివారులోని ఇటుకబట్టీ వద్ద చోటుచేసుకుంది. ఎస్సై షరీఫ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన భరత్ మాజీ, అతని భార్య మెంట్రాజ్‌పల్లిలోని ఆంజనేయులుకు చెందిన ఇటుకబట్టీలో కొంతకాలంగా కూలీలుగా పనిచేస్తున్నారు. వారి కొడుకు మున్షీ మాజీ (14)ని స్థానికంగా చదువుకోవాలని లేదా పనిచేయాలని తండ్రి మంగళవారం మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన మున్షి మాజీ అర్ధరాత్రి తాము ఉంటున్న రేకుల షెడ్డులోని కర్రకు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే గమనించిన కుటుంబసభ్యులు బట్టీ యజమానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
భార్య కాపురానికి
రావడం లేదని..
కామారెడ్డి క్రైం: భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీ శివారులో బుధవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన తక్కడపల్లి శ్రీకాంత్ (32) మెకానిక్‌గా పనిచేస్తూ బీడీ వర్కర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య లత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గొడవల కారణంగా భార్య పిల్లలతో కలిసి మూడు నెలలుగా తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. దీంతో శ్రీకాంత్ మద్యానికి బానిసయ్యాడు. భార్య కాపురానికి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన శ్రీకాంత్ బుధవారం జయశంకర్ కాలనీ సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కరడ్‌పల్లి గ్రామశివారులో పేకాటస్థావరంపై బుధ వారం దాడి చేసి రాజు, సంతోష్, నర్స య్యలను పట్టుకున్నట్లు ఎస్సై మురళి తెలిపా రు. వారిపై కేసు నమోదు చేసి, రూ.8,700 లు, మూడు బైక్‌లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.