
విత్తనపూజకు వేళాయె
● జంగుబాయి సన్నిధిలో ఆదివాసీల పూజలు ● ఆలయంలో రేపటి నుంచి నెలరోజులు ఉత్సవాలు
కెరమెరి(ఆసిఫాబాద్): ఆనాదిగా వస్తున్న ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో ఆదివాసీలు ముందుంటున్నారు. జూన్ 8న మృగశిరకార్తె ప్రవేశించనుండడంతో ఆదివాసీలు తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని మహరాజ్‌గూడ అడవుల్లో కొలువైన జంగుబాయికి పుణ్యక్షేత్రంలో విత్తన పూజకు శ్రీకారం చుట్టారు. అక్కడి గుహలోకి వెళ్లి దీపం వద్ద పూజలు చేస్తారు. రావుడ్, పోచమ్మ, మైసమ్మకు విత్తనాలు చూపించి మొక్కి అమ్మవార్లకు నైవేద్యం చూపిస్తారు. విత్తన పూజల అనంతరం తమ పొలాల్లో విత్తనాలు నాటడం ప్రారంభిస్తారు. దీన్ని గోండి భాషలో ‘మొహతుక్’అంటారు. అదేవిధంగా గిరి గ్రామాల్లో ఏటా జరిగే విత్తన పూజల ముందుగా జంగుబాయి అమ్మవారికి విత్తనాలు చూపెట్టాక పొలాల్లో నాటడంతో అధిక దిగుబడి వస్తాయని భక్తుల నమ్మకం.
నేడు దీపోత్సవం
జంగుబాయి సన్నిధిలో గురువారం దీపోత్సవం, శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు. వివిధ గ్రామాలకు చెందిన మోళంలు తరలివచ్చి పూజలు చేస్తాయి. దుక్కిలతో దున్ని విత్తనాలు వేసేందుకు తమ పొలాలను రైతులు సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాలోనే ఆదివాసీలు అధికంగా ఉన్నారు.
దేవతలకు విత్తనాలు చూపిస్తారు
మే మాసంలో అన్ని గ్రామాల్లో గ్రామ పటేల్ ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆదివాసీల కులదైవమైన పాటేరు అమ్మోరు, జంగుబాయి, గాంధారి కిల్ల, పద్మాల్‌పురి కాకో వద్దకు వెళ్లి విత్తనాలను చూపిస్తారు. అక్కడే దేవతల ఆశీర్వాదం తీసుకుని తిరుగుపయనమవుతారు. అనంతరం గ్రామంలో ఉన్న ఆకిపేన్, అమ్మోరు, పోచమ్మ వద్దకు వెళ్లి విత్తనాలతో పూజలు చేస్తారు. అదే రోజు రాత్రి 2.5 కిలోల జొన్నలతో గట్క తయారు చేసి ఆరగిస్తారు. అర్ధరాత్రి అడవికి వెళ్లి (కుమ్ముడ్) చెట్టు ఆకులను తీసుకువచ్చి డొప్పలు తయారు చేసి ఇళ్లల్లో ఇస్తారు. అందులో పూజ చేసిన విత్తనాలు వేస్తారు. ఈ కార్యక్రమంతా మృగశిర మాసానికి కొద్ది రోజుల ముందుగా నిర్వహిస్తారు.
విత్తన పూజలు(మొహతుక్)
విత్తన పూజ చేయాలన్న రోజు రైతు కుటుంబమంతా ఉదయాన్నే పొలం బాట పడుతారు. ఉదయం ఇంటిని శుభ్రం చేసి పేడతో అలుకు చల్లుతారు. పొలానికి వెళ్లాక జొన్నతో గట్కా తయారు చేసి కులదైవంతోపాటు నేల తల్లికి సమర్పిస్తారు. అనంతరం పొలంలో విత్తనాలు చల్లి అరకకు ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటుతారు. గ్రామ పటేల్ ఇంటి ఎదుట మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తారు. పురుషులు గిల్లిదండా ఆట ఆడుతారు. తర్వాత సహపంక్తి భోజనం చేస్తారు.
చంచి భీమల్ దేవుడి కల్యాణంతో..
ఆదివాసీల ఇష్టదైవమైన చంచి భీమల్ దేవుడి కల్యాణం సందర్భంగా ఏటా ఏప్రిల్, మే మాసంలో విత్తనాలను దేవుడికి చూపిస్తారు. ఆరోజు ఆదివాసీలు భీమల్ దేవుడికి సంప్రదాయ పూజలు చేస్తారు. అడవుల్లో లభించే ఆకులతో ఆరు డొప్పలను తయారు చేస్తారు. అందులో అన్ని విత్తనాలను కలిపి భీమల్ దేవునికి చూపిస్తారు. అనంతరం వాటిని ఇళ్లకు తీసుకెళ్లి దాచి పెడ్తారు. ఆరోజు పిండి వంటలు చేసి ఆరగిస్తారు. మృగశిర కార్తె ప్రారంభంతో ఆ విత్తనాలను తమ పొలాల్లో చల్లుతారని పలువురు చెబుతున్నారు.
దేవతలకు చూపించాకే..
పొలాల్లో విత్తనాలు నాటే కొన్నిరోజుల ముందు కుల దేవతలకు వాటిని చూపిస్తాం. ప్రత్యేక పూజలు చేశాకే పొలానికి వెళ్లి జొన్నగట్కాను వండి ఆరగిస్తాం. నేలతల్లికి ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటడం ప్రారంభిస్తాం. – సలాం శ్యాంరావు,
జంగుబాయి ఉత్సవ కమిటీ చైర్మన్
ఆచారాలు పాటిస్తున్నాం
ఆదివాసీలు ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ వస్తున్నారు. ఏళ్ల క్రితం నుంచి ప్రారంభమైన విత్తన(మొహతుక్) పూజలు ఇప్పుడు కూడా చేస్తున్నాం. పూజలు చేయందే విత్తనాలు నాటం.– పుర్క బాపూరావు, జంగు
బాయి ఉత్సవ కమిటీ, ప్రచార కార్యదర్శి

విత్తనపూజకు వేళాయె

విత్తనపూజకు వేళాయె

విత్తనపూజకు వేళాయె

విత్తనపూజకు వేళాయె