
కోల్‌కతా: బీహార్‌లో ఓటరు జాబితా సవరణ పేరుతో కొందరు ఓటర్ల పేర్లను ప్రభుత్వం తొలగించిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు ‘ఓటర్ అధికార్ యాత్ర’ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ యాత్రలో టీఎంసీ నేత, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ భాగస్వాములు కానున్నారు. ఆయనతో పాటు మరో టీఎంసీ నేత లలితేష్ త్రిపాఠి కూడా ఈ యాత్రలో పాల్గొననున్నారు.
సెప్టెంబర్ ఒకటిన బీహార్‌లో జరిగే ‘ఓటర్ అధికార్ యాత్ర’లో యూసుఫ్ పఠాన్, లలితేష్ త్రిపాఠిలు తృణమూల్ కాంగ్రెస్ తరపున పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 17న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ పాదయాత్రను ప్రారంభించారు. బీహార్‌లో చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ ఈ యాత్రను చేపట్టారు. సోమవారం(సెప్టెంబరు ఒకటి)పట్నాలో జరిగే ఊరేగింపుతో ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగియనుంది. యూసుఫ్ పఠాన్, లలితేష్ త్రిపాఠిలు పట్నాలో జరిగే ‘ఓటర్ అధికార్ యాత్ర’కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీహార్‌లోని 65 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారు. బీహార్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఈ యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ సహాయంతో ఓట్లను దొంగిలిస్తూ పట్టుబడటంతో బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. ముసాయిదా ఓటర్ల జాబితా నుండి 65 లక్షల మంది పేర్లను తొలగించడం అనేది వారి ఓటు హక్కుపై జరిగిన దాడిగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి.