
లాతూర్: బదిలీ అయిన తహశీల్దార్ ఒకరు ఆఫీసులో ఏర్పాటైన వీడ్కోలు సమావేశంలో హిందీ పాట పాడిన పాపానికి సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లా ఉమ్రిలో తహశీల్దార్‌గా ఉన్న ప్రశాంత్ థోరట్ ఇటీవల పొరుగునే ఉన్న లాతూర్ జిల్లా రెనాపూర్‌కు బదిలీ అయ్యారు. జూలై 30వ తేదీన ఉమ్రిలో ఆయనకు కార్యాలయం సిబ్బంది సెండాఫ్ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రశాంత్ థోరట్ ఉత్సాహంతో 1981నాటి అమితాబ్ బచ్చన్ సినిమా యారానాలోని ‘యారా తేరీ యారీ కో..’అంటూ పాటపాడారు.
అక్కడి వారంతా చప్పట్లతో ఆయన్ను ఉత్సాహ పరిచారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో ప్రశాంత్ థోరట్ వెనుక తాలూకా మేజిస్ట్రేట్ అనే నేమ్ ప్లేట్ స్పష్టంగా కనిపిస్తోంది. థోరట్ ప్రవర్తన అధికార హోదాకు తగినట్లుగా లేదంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు మహారాష్ట్ర సివిల్ సర్వీసెస్ ప్రవర్తన నిబంధనావళి–1979కు విరుద్ధంగా వ్యవహరించారనే కారణంపై థోరట్ సస్పెన్షన్‌కు శనివారం ఆదేశాలిచ్చారు.