చపాతీ కాదు.. చీటింగ్‌

Scams In Online Food Orders Exploitation Of Apps - Sakshi

బనశంకరి: ఆకలితో ఉన్నవారిని సైబర్‌ నేరగాళ్లు ఇట్టే దోచుకుంటున్నారు. ఇందులో నిరక్షరాస్యులకంటే విద్యావంతులే ఎక్కువగా నష్టపోతున్నారు. నగరంలో సాధారణ పోలీస్‌ స్టేషన్లలో ఏడాదికి 250 నుంచి 300 క్రైం కేసులు నమోదు అవుతుంటే, సైబర్‌ పోలీస్‌స్టేషన్లులో నమోదు అవుతున్న నేరాల సంఖ్య 1000 కి పైగా ఉంటోంది. ఇప్పటి వరకు ఉద్యోగం, బిల్లులు చెల్లింపు, బ్యాంకింగ్, షేర్లు, బిట్‌కాయిన్‌ పేరుతో  ప్రజల వద్ద నుంచి డబ్బు కాజేస్తున్నారు. ఇప్పుడు ఆహార పంపిణీలోకి వంచకులు చొరబడ్డారు.  
లింక్‌ పంపి నకిలీ యాప్‌ల ద్వారా దందా  

  • ఫుడ్‌ ఆర్డర్లలో మోసం ఇలా జరుగుతుంది. బెంగళూరు ఎక్కువగా గిరాకీ ఉన్న హోటల్స్‌ పేరుతో మోసగాళ్లు నకిలీ యాప్‌లను సృష్టిస్తారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా తదితరాల్లో ఆకర్షణీయంగా ప్రచారం చేసుకుంటారు.  
  • సోషల్‌ మీడియా చూసేవారు ఈ ప్రకటనల ప్రలోభపడి ఆర్డర్లు బుక్‌ చేస్తారు. అక్కడ సూచించిన కొన్ని నంబర్లకు ఫోన్‌ చేయగా బుకింగ్‌ స్వీకరించాము. నగదు చెల్లించండి అని సూచన వస్తుంది. దానిని నమ్మి కస్టమర్లు గూగుల్‌పే, ఫోన్‌పే తదితరాలతో నగదు చెల్లిస్తారు. ఇంకా కొందరు క్రెడిట్‌ కార్డు, డెబిట్‌కార్డు వినియోగిస్తారు.  
  • మోసగాళ్లు మళ్లీ కాల్‌ చేసి మీ డబ్బు జమ కాలేదని, తమ హోటల్‌ యాప్‌ లింక్‌ పంపిస్తాము. దానిని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే పుడ్‌ ఆర్డర్, చెల్లింపు సులభమవుతుందని, పైగా డిస్కౌంట్‌ లభిస్తుందని నమ్మిస్తారు.  
  • సరేనని వారు పంపిన లింక్‌ పై క్లిక్‌ చేస్తే అంతే సంగతులు. బాధితుల ఫోన్‌ను హ్యాక్‌ చేసి నగదు దోచేస్తారు. అంతేగాక మెయిల్, వాట్సాప్‌ చాటింగ్‌తో పాటు అనేక వ్యక్తిగత సమాచారం మొత్తం నేరగాళ్ల పాలవుతుంది. తద్వారా బాధితులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకుంటారు.

రెండు పెద్ద మోసాలు

  • ఆన్‌లైన్‌ పుడ్‌ ఆర్డర్‌ చేయడానికి వెళ్లిన ఇంజనీర్, మరొకరు భారీగా వంచనకు గురయ్యారు. బెంగళూరుకు చెందిన దీపికా అనే ఇంజనీర్‌ ఫేస్‌బుక్‌లో ఆహార ప్రకటనను చూసి చపాతీ– చికెన్‌ కర్రీని   
  • ఆర్డర్‌ చేయడానికి ఫోన్‌ చేసింది. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఖాందాని రాజధాని రెస్టారెంట్‌ అని పరిచయం చేసుకున్నాడు. తాము పంపే లింక్‌లో ఉన్న రుచిసాగర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. దీపిక సరేనని ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని క్రెడిట్‌కార్డు సమాచారం తెలిపి ఆర్డర్‌ చేసింది. ఇక అంతే.. దశలవారీగా ఆమె అకౌంట్‌ నుంచి రూ.61 వేలు కట్‌ అయ్యాయి.  

మరొకరికి రూ.2.23 లక్షలు టోపీ 

  • మరో కేసులో ఇమ్రానుల్లాబేగ్‌ ఆన్‌లైన్‌లో నంబరు చూసి ఫుడ్‌ ఆర్డర్‌ చేసి రూ.250 చెల్లించాడు. కానీ అవతలి వ్యక్తి తమకు నగదు జమ కాలేదని, ఫలానా లింక్‌ ద్వారా యాప్‌ నుంచి డబ్బు పంపాలని సూచించాడు. ఆకలితో ఉన్న బాధితుడు మరో ఆలోచన లేకుండా ఆ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నాడు. వెంటనే అతని క్రెడిట్‌ కార్డు నుంచి  రూ.2,23,858 పోయాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ రెండు కేసుల్లో మోసగాళ్లు ఒకే మొబైల్‌ నంబరును వినియోగించారు. 

(చదవండి: చెరువు వద్ద మిస్టరీ...పాపను పాఠశాల వద్ద వదిలివస్తానని చెప్పి...)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top