
సోషల్ మీడియా వేదికగా ‘లైవ్ స్ట్రీమింగ్’
దేశంలో ‘సోషల్ కామర్స్’ కొత్త పోకడలు
అంతర్జాతీయంగా దుస్తులకు ప్రాధాన్యత
వ్యాపారం చేయాలంటే ఓ భారీ స్థాయి మాల్ కాకపోయినా.. చిన్న దుకాణం అయినా పెట్టుకోవాలి. లేదా రోడ్డుపై తోపుడు బండి అయినా నిర్వహించాలి. అదీ కాదంటే వాహనం ఆసరాగా చేసుకుని విక్రయాలు సాగించాలి. ఇదంతా సంప్రదాయ పోకడ. ఆన్ లైన్ రాకతో ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ మోడల్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా కాస్తా ‘సోషల్ కామర్స్’ అయిపోయింది. అంటే ప్రత్యక్షంగా దుకాణాలు పెట్టాల్సిన అవసరం లేకుండానే సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. కోట్ల మందికి ఇప్పుడీ ప్లాట్‌ఫామ్స్ బిజినెస్ అడ్డాలుగా అవతరించాయి.
ఆన్ లైన్ లో ఉత్పత్తుల తాలూకు వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం.. ఓ ఫోన్ నంబర్ ద్వారా వ్యాపారం చేయడం సాధారణం. ఈ–కామర్స్‌లో ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ కొత్త ట్రెండ్. విక్రేతలు యూట్యూబ్ లైవ్, ఫేస్‌బుక్ లైవ్, ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా రియల్ టైమ్‌లో ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు. వీక్షకులు తమ కామెంట్స్ ద్వారా హోస్ట్‌తో సంభాషించవచ్చు. లైవ్ పోల్స్ నిర్వహించేందుకు హోస్ట్‌కు వీలవుతుంది.
తెలివైన విక్రేతలు తాము తదుపరి వారం/తేదీన పరిచయం చేయబోయే ఉత్పత్తి గురించి ముందుగానే కొన్ని వివరాలను టీజర్ రూపంలో వెల్లడించి వీక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. అంతేగాక 24 గంటల కౌంట్‌డౌన్ నిర్వహించి తమ ఫాలోవర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తద్వారా ఎక్కువ మంది వీక్షకులను చేరుకుంటున్నారు. సోషల్ కామర్స్ భారత్‌లో 2025లో సుమారు రూ.1,80,000 కోట్ల వ్యాపారం చేస్తుందని అంచనాలు ఉన్నాయి. దేశంలో 90 కోట్లకుపైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. వీరిలో 25 శాతానికిపైగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. వర్ధిల్లు వ్యాపారాలు
తాము సొంతంగా తయారు చేసిన ఉత్పత్తులు, పిండి వంటలు, కళాఖండాలు, అల్లికలు, పెయింటింగ్స్.. ఒకటేమిటి, వ్యాపారానికి ఏదీ అనర్హం కాదు. వ్యాపారం చేయాలంటే ఈ రోజుల్లో ఓ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. ఔత్సాహికులు తక్కువ పెట్టుబడితో తమ కాళ్లమీద తాము నిలబడవచ్చు. చేతిలోని సెల్‌ఫోన్ తో వీడియోలు, ఫొటోలే కాదు.. లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించి తాము విక్రయించే ఉత్పాదనను ప్రపంచానికి పరిచయం చేయవచ్చు. లైవ్ వీడియో చేయాలంటే పెద్దగా సాంకేతికంగా అవగాహన కూడా అవసరం లేదు. ఎడిటింగ్ భారం అసలే లేదు.
దశాబ్దాల నుంచి..
వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి వీడియోలు ఉపయోగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వీడియోలు, షార్ట్స్ చూడటం పెరిగింది. ముఖ్యంగా ఉత్పత్తులు, సేవల గురించి తెలుసుకోవడానికి వీడియోలను చూసే ధోరణి ఊపందుకుంది. ఈ నేపథ్యంలో లైవ్ స్ట్రీమింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. లైవ్ స్ట్రీమింగ్‌తో షాపింగ్ ఎక్స్‌పీరియెన్స్ మారుతుందని ఈ–కామర్స్ దిగ్గజం అలీ ఎక్స్‌ప్రెస్ చెబుతోంది.
వాయిదాలకు ఫుల్‌స్టాప్
ఈ–కామర్స్ వెబ్‌సైట్లలో చాలామంది కస్టమర్లు తాము చూసిన ఉత్పాదనను తరువాత కొనొచ్చులే అని కార్ట్‌లో నిక్షిప్తం చేస్తారు. చాలా సందర్భాల్లో అవి కార్ట్‌కే పరిమితం అవుతాయి. అదే లైవ్‌లో అయితే.. నచ్చగానే ఆర్డర్ పెట్టేయొచ్చు. హోస్ట్ మీద, ఉత్పత్తి మీద నమ్మకం ఏర్పడితే.. వెంటనే ఆర్డర్ చేసేలా మనస్సు కూడా వీక్షకులను ప్రేరేపిస్తుంది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. తరచూ వాయిదాలు వేసే కస్టమర్ల విషయంలో విక్రేతలకు లైవ్ స్ట్రీమింగ్ కలిసి వస్తుందని వారు చెబుతున్నారు.

ప్రత్యక్షంగా వీక్షించి..
ఆన్ లైన్ వ్యాపారంలో భాగంగా విక్రేతలు ఉత్పత్తుల తాలూకు వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడం సర్వసాధారణం. అయితే ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించే వ్యక్తి (హోస్ట్) లైవ్ వీడియోలో ఉత్పత్తి గురించి పూర్తి వివరాలు వెల్లడించేందుకు వీలవుతుంది. లైవ్‌లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా లక్షలాది మంది ఫాలోవర్లకు ప్రత్యక్షంగా అవి చేరతాయి. సందేహాలు ఉంటే నివృత్తి అవుతాయి. హోస్ట్ ఇచ్చే ప్రెజెంటేషన్ ఇక్కడ కీలకం. ప్రసంగం ఆకట్టుకునేలా ఉంటే ఉత్పత్తి పట్ల కస్టమర్లలో సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఉత్పత్తి ఎలా పనిచేస్తుంది, ప్రత్యేకతలు, వారంటీ, గ్యారంటీ, ధర, మార్కెట్లో లభించే ఇతర ఉత్పత్తులతో పోలిస్తే తాము విక్రయించే ప్రొడక్ట్ విశేషాలను కస్టమర్లతో నేరుగా పంచుకోవచ్చు.