అద్భుతం.. ఇంటి మేడ మీద 4 వేల మొక్కలు

Bhopal Woman Grows 4000 Rare Exotic Plants in Coconut Shells - Sakshi

వేళ్లాడే తోట.. మేడ మీద చూడమంట

భోపాల్‌ : ప్రపంచంలోని ఒకప్పటి ఏడు వింతల్లో బాబిలోనియాలోని హ్యాంగింగ్‌ గార్డెన్స్‌ గురించి విన్నాం. అచ్చంగా అలాంటిది కాదు, కానీ... ఇప్పుడు మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో ఒక వేళ్లాడే తోటను చూస్తున్నాం. సాక్షి భరద్వాజ్‌ ఇంటి మీద వేళ్లాడే ఈ తోటలో నాలుగు వందల యాభై రకాల మొక్కలున్నాయి. దేశీయ విదేశీ మొక్కలన్నీ కలిపి మొత్తం నాలుగు వేలున్నాయి. మైక్రో బయాలజీ చదివి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సాక్షి... స్టూడెంట్స్‌కి చెప్పబోయే పాఠాలను ప్రయోగాత్మకంగా తన ఇంటి ఆవరణలోనే పెంచి చూసేది. అది చివరికి ఒక తోటగా మారింది. నేల మీద కుండీలు, సిమెంట్‌ తొట్టెల్లో పెంచుతుంటే... మొక్కలకు ఎరువుగా వేసిన బత్తాయి, కమలా తొక్కలను తినడానికి వచ్చిన చీమలు మొక్కల వేళ్లను కూడా తినేస్తున్నాయి. ఈ చీమల బెడదను తప్పించి మొక్కలను కాపాడడానికి ఆమె చేసిన మరో ప్రయోగమే ఖాళీ కొబ్బరి బోండాల్లో మొక్కలను పెంచడం. అది విజయవంతమైంది. అలా ఆమె ఇంటి మీద వేళ్లాడే తోట ఆవిష్కారమైంది.

పాఠాల తోట
సాక్షి భరద్వాజ్‌ మైక్రోబయాలజీ పూర్తి చేసి రెండేళ్ల కిందట మన్‌ సరోవర్‌ గ్లోబల్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరింది. మొక్కల జన్యుకణాల గురించి థియరీ చెప్పి ఊరుకోవడం కాదు, దానిని ఆచరణలో చూపించాలనుకుంది. అంటుకట్టడం, బత్తాయి వంటి పుల్లటి పండ్లతొక్కల నుంచి బయో ఎంజైమ్‌ల తయారీ, వేప– బొప్పాయి ఆకులతో వర్మీ కంపోస్టు తయారీ వంటివన్నీ స్వయంగా చేసి చూసుకుంది.‘‘మొదటగా సిమెంట్‌ తొట్టెల్లో చేసిన ప్రయోగం ఎర్ర చీమల కారణంగా విఫలమైంది. ప్రత్యామ్నాయం ఏమిటా... అని ఆలోచిస్తున్న సమయంలో కొబ్బరి బోండాం గుర్తుకు వచ్చింది. నాకు రోజూ కొబ్బరి బోండా తాగే అలవాటుంది. ఖాళీ బోండాలనే మొక్కల పాదుల్లా మలుచుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది అ‍న్నారు. (చదవండి: మూడు దశాబ్దాలుగా పీడిస్తున్న పీడకల)

‘‘దాంతో బోండాలను కడిగి ఆరబెట్టి, రెండు రంధ్రాలు చేసి ఇనుప తీగె కట్టి, వరండా పైకప్పుకి హుక్కులు వేయించి కొబ్బరి బోండాలను వేళ్లాడదీసి చూశాను. కొబ్బరి బోండాంలోని సహజమైన పోషకాలు కూడా మొక్కల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. అప్పటి నుంచి చీమల బెడద మాత్రమే కాదు తెగుళ్ల బాధ కూడా లేదు. ప్రయత్నం సఫలమైన తర్వాత కొబ్బరి బోండాలు ఆకర్షణీయంగా కనిపించడానికి రంగులు కూడా వేశాను. అలాగే వాడిపారేసిన మంచినీళ్ల సీసాల అడుగు తీసేసి అందులోనూ మొక్కలను నాటాను. ఇప్పుడు నా దగ్గర నాకిష్టమైన మాన్‌స్టెరా ఎదామ్‌సోనాయ్‌ ఇండోనేసియా నుంచి తెప్పించిన అరుదైన ఫిలోడెండ్రాన్‌ కూడా ఉంది. మొక్కల పేర్లు చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే అవుతుంది. నా తోట పాఠ్య పుస్తకానికి జీవరూపం’’ అన్నారు సాక్షి భరద్వాజ్‌.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top