‘పూరన్‌ భార్యను అరెస్ట్‌ చేస్తేనే పోస్ట్‌మార్టం, అంత్యక్రియలు జరగనిస్తాం’ | ASI Sandeep Kumar Sensational Allegations On Late IPS Officer Puran Wife, Check More Details Inside | Sakshi
Sakshi News home page

‘పూరన్‌ భార్యను అరెస్ట్‌ చేస్తేనే పోస్ట్‌మార్టం, అంత్యక్రియలు జరగనిస్తాం’

Oct 15 2025 9:20 AM | Updated on Oct 15 2025 10:19 AM

ASI Sandeep Kumar Sensational allegations On late IPS officer puran Wife

హర్యానాలో పోలీసుల బలవర్మనణాలు సంచలనం సృష్టిస్తున్నాయి. సంచలన ఆరోపణలు చేస్తూ.. తెలుగు ఐపీఎస్‌ అధికారి పూరన్‌ కుమార్‌ తొలుత ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఏఎస్సై సందీప్‌ కుమార్‌ కూడా సూసైడ్‌ చేసుకోవడం, అందులో పూరన్‌ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేయడం.. మొత్తంగా ఊహించని మలుపులతో సాగుతోంది ఈ వ్యవహారం. 

పూరన్‌ కుమార్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు ఎట్టకేలకు ఆయన భార్య, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి అమ్నీత్‌ ఎట్టకేలకు అంగీకరించారు. దీంతో ఇవాళ సాయంత్రమే ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈలోపు అటు రోహ్‌తక్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఏఎస్సై సందీప్‌ కుమార్‌కు పోస్ట్‌మార్టం జరగనీయకుండా ఆయన కుటుంబం అడ్డుపడింది. మృతదేహాన్ని పోలీసులకు అప్పగించకుండా తమ వెంట స్వగ్రామానికి తీసుకెళ్లింది. తమ బిడ్డ మరణానికి ఐఏఎస్‌ అధికారిణి అమ్నిత్‌ పూరన్‌ కుమార్‌(పూరన్‌ భార్య)కు సంబంధం ఉందని, ఆమెను అరెస్ట్‌ చేయాల్సిందేనని ఏఎస్సై సందీప్‌కుమార్‌ కుటుంబం డిమాండ్‌ చేస్తోంది. 

2001 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఏపీ వాసి పూరన్‌ కుమార్‌.. ఛండీగఢ్‌లోని తన నివాసంలో అక్టోబర్‌ 7వ తేదీన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుననారు. తనపై సీనియర్‌ అధికారులు కుల వివక్ష ప్రదర్శించారని, అవమానాలతో మానసికంగా వేధించారని 9 పేజీల సూసైడ్ నోట్‌లో 10 మంది సీనియర్ పోలీస్ అధికారుల పేర్లను పూరన్‌కుమార్‌ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో.. 

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి అయిన ఆయన సతీమణి అమ్నీత్ పూరన్ కుమార్ తన భర్తకు  13 మంది ఐపీఎస్‌ అధికారులు కారణమంటూ SC/ST చట్టం కింద కేసు నమోదు చేయించారు. అయితే పోలీసు పెద్దల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకపోవడంతో ఆమె పోస్ట్‌మార్టం, అంత్యక్రియలు జరపబోమని ఇప్పటిదాకా అడ్డుపడుతూ వచ్చారు. అయితే ఈలోపు.. 

అక్టోబర్‌ 14వ తేదీన రోహ్‌తక్‌ సైబర్‌ సెల్‌లో పని చేసే ఏఎస్సై సందీప్‌ కుమార్‌ పానిపట్‌ రోడ్డులోని ఓ వ్యవసాయ బావి వద్ద మృతదేహాంగా లభ్యమయ్యారు. మూడు పేజీల సూసైడ్‌ నోట్‌, ఆరు నిమిషాల వీడియో మెసేజ్‌లో సందీప్‌ చనిపోయిన ఐపీఎస్‌ పూరన్‌ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పూరన్‌ అవినీతిపరుడని.. తనకు అనుకూలమైన వారిని విధుల్లో చేర్చుకుని  వేల కోట్ల ఆస్తుల్ని కూడబెట్టారని.. వాటిపై దర్యాప్తు చేయించాలని సందీప్‌ డిమాండ్‌ చేశాడు. అంతేకాదు.. లిక్కర్‌షాపుల నుంచి బలవంతపు వసూళ్లు చేసేవారని.. మహిళా పోలీసుల్ని పూరన్‌ వేధించారని ఆరోపించాడు.

తననూ ఈ కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని, అరెస్ట్‌ భయంతోనే తాను ఈ ఘాతుకానికి పాల్పడుతున్నానని.. న్యాయం గెలవాలని, నిజం ఎలాగైనా బయటపడాలని చెబుతూ ఆత్మహత్య చేసుకున్నారాయన. 

ఇదిలా ఉండగా.. పూరన్‌ కుమార్‌ దగ్గర గన్‌మెన్‌గా పని చేసిన హెడ్‌కానిస్టేబుల్‌ను ఏఎస్సై సందీప్‌ కుమార్‌ అవినీతి కేసులో(లంచం) అరెస్ట్‌​ చేశాడు. అప్పటి నుంచి సందీప్‌కు వేధింపులు ఎదురయ్యాయని, అది భరించలేక ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని ఆయన కుటుంబం ఆరోపిస్తోంది.  ఈ వేధింపుల్లో అమ్నీత్‌ హస్తం కూడా ఉందని, అందుకే ఆమెను అరెస్ట్‌ చేయాలని, పూరన్‌ ఆస్తులపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించాలని.. అప్పటిదాకా అంత్యక్రియలు జరపబోమని సందీప్‌ కుటుంబం ఖరాకండిగా చెబుతోంది. 

సందీప్‌ది సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి ఎస్సై. గత ఐదారేళ్లుగా రోహ్‌తక్‌లోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అవినీతి, కుల రాజకీయాలు సందీప్‌ను బలిగొన్నాయని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

ఐపీఎస్‌ పూరన్‌ కుమార్‌ సూసైడ్‌ కేసులో ఇప్పటికే సిట్‌ దర్యాప్తు జరుగుతోంది. ఈలోపు ఏఎస్సై సందీప్‌ సూసైడ్‌.. సంచలన ఆరోపణలతో ఈ కేసు క్లిష్టతరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement