శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ కలకలం
శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం పరిధిలోని టోల్‌గేట్ వద్ద మంగళవారం సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న కారులోని వ్యక్తి వద్ద రివాల్వర్ కనిపించడం కలకలం రేపింది. వన్‌టౌన్ సీఐ ప్రసాద్ రావు తెలిపిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్ భూపాల్ సిటీకి చెందిన క్రైమ్ బ్రాంచ్ ఎస్‌ఐ గోవింద యాదవ్ మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు కానిస్టేబుళ్లు కలిసి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు కేసు విషయాలపై తిరుగుతూ శ్రీశైలం సందర్శనకు వచ్చారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తూ ప్రకాశం జిల్లా దోర్నాల వద్దకు రాగానే ప్రముఖ జ్యోతిర్లింగా శైవ క్షేత్రమైన శ్రీశైలం 50 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుసుకొని స్వామివార్లను దర్శించుకోవాలనే ఉద్దేశంతో శ్రీశైలం చేరుకున్నారు. నిత్యం టోల్‌గేట్ వద్ద జరిగే సాధారణ వాహన తనిఖీల్లో భాగంగా అక్కడ విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది కారులో రివాల్వర్ కనిపించడంతో సీఐకి సమాచారం అందించారు. కారుతో పాటు వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఐడీ కార్డులు, రివాల్వర్ వెరిఫికేషన్ తదితర పూర్తి వివరాలు సేకరించారు. విధి నిర్వహణలో భాగంగా సర్వీస్ రివాల్వర్‌ను ఎస్‌ఐ గోవింద్ యాదవ్ తన వద్ద ఉంచుకున్నట్లు వెల్లడైందని సీఐ తెలిపారు. శ్రీశైలం వన్‌టౌన్ ప్రోటోకాల్ పోలీసులను పిలిపించి క్రైమ్ బ్రాంచ్ ఎస్‌ఐ, సిబ్బందికి స్వామి, అమ్మవార్ల దర్శనం చేయి ంచారు. అనంతరం వారి నుంచి స్వాధీనం చేసుకున్న రివాల్వర్, ఐడీకార్డులను అప్పగించి పంపించేశారు.


