జగన్ హయాంలోనే రైతులకు మేలు
మాజీ మంత్రితో టీడీపీ మద్దతుదారుడు
గత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనే రైతులకు అన్ని విధాలుగా మేలు జరిగిందని చండ్రపల్లి గ్రామానికి చెందిన రైతు గొల్ల కోదండరాముడు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముందు తన అభిప్రాయన్ని వెల్లడించాడు. రైతుల కష్టాలు తెలుసుకునేందుకు మంగళవారం పాదయా త్ర చేసిన మాజీ మంత్రి బుగ్గన చండ్రపల్లి గ్రామంలో మొక్కజొన్న రైతులతో మాట్లాడారు. మొక్కజొన్న ధర ఎలా ఉందని మాజీ మంత్రి ప్రశ్నించగా క్వింటా రూ.1,600కు విక్రయిస్తున్నట్లు రైతు కోదండరాముడు తెలిపాడు. ప్రభుత్వం మొక్కజొన్నకు రూ. 2,400 మద్దతు ధర ప్రకటించిన విషయాన్ని మాజీ మంత్రి రైతు ముందు ప్రస్తావించగా.. అవన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయని సదరు రైతు వాపోయాడు. ఈ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, గత వైఎస్సార్‌సీపీ హయాంలోనే తమకు అన్ని పథకాలు నేరుగా అందాయని వివరించారు. అలాగే అన్ని పంటలకు గిట్టుబాటు ధర లభించి జగన్ హయాంలోనే తాము సంతోషంగా ఉన్నామని అందరి ఎదుట చొప్పుకొచ్చారు. తాను టీడీపీ మద్దతుదారైనప్పటికీ ఉన్న నిజాన్ని మాత్రమే చెప్పానంటూ.. వ్యాఖ్యానించడం విశేషం.


