
ప్రేమ పేరుతో రూ.35 లక్షల మోసం
కర్నూలు: ‘ ప్రేమించినట్లు నమ్మించి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. గోల్డ్ కాయిన్స్ తీసుకుని.. రూ.35 లక్షలు నగదు బ్యాంక్ ఖాతాలో జమ చేయించుకుని ఒక మహిళ మోసం చేసింది’ అని ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు కర్నూలు కొత్తపేటకు చెందిన మునీర్ అహ్మద్ ఖురేషి ఫిర్యాదు చేశారు. తాను లండన్‌లో హోటల్ మేనేజర్‌గా పనిచేస్తుండగా కడప జిల్లాకు చెందిన ఓ మహిళ ఇన్‌స్ట్రాగామ్‌లో చాటింగ్, వీడియో కాల్స్ చేస్తూ రెండున్నర సంవత్సరాల క్రితం పరిచయమై, చైన్నెలోని ఇన్ఫోటెక్‌లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పిందన్నారు. తాను లండన్ నుంచి జూన్ 4వ తేదీన కర్నూలుకు వచ్చానని, 5వ తేదీ నుంచి తన మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేసి ఆ మహిళ మోసం చేసిందని మునీర్ అహ్మద్ ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
135 ఫిర్యాదులు
రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 135 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. మహిళా పీఎస్ డీఎస్పీ శ్రీనివాసాచారి కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని...
● కర్నూలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలుకు చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.6 లక్షలు తీసుకుని మోసం చేశారని మంత్రాలయం మండలం రచ్చుమర్రి గ్రామానికి చెందిన రాజు, మునిస్వామి ఫిర్యాదు చేశారు.
● పూణెలోని జీకే వర్క్స్ అసోసియేషన్ ఇంజనీరింగ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని, సంవత్సరానికి రూ.5 లక్షలు ప్యాకేజీ ఉంటుందని కడప పట్టణానికి చెందిన అశోక్ కుమార్ రూ.1.50 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చి మోసం చేశాడని కర్నూలు మాధవీ నగర్‌కు చెందిన చంద్రకళ ఫిర్యాదు చేశారు.
● ఇద్దరి పిల్లలకు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి జిషిత్ రాణి, శ్రేయస్ రూ.4.30 లక్షలు తీసుకుని బోగస్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించి మోసం చేశారని కర్నూలు ఉద్యోగనగర్‌కు చెందిన ఆర్.ప్రకాష్ రాజు ఫిర్యాదు చేశారు.
● పత్తికొండ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ తన పొలంలోకి అక్రమంగా చొరబడి కొందరు ఆటంకాలు కలిగిస్తున్నారని తుగ్గలి గ్రామానికి చెందిన మంగలి రంగమ్మ ఫిర్యాదు చేశారు.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు
పీజీఆర్‌ఎస్‌కు 135 ఫిర్యాదులు