
కూటమి పాలనలో శాంతి లేదు.. భద్రత లేదు
● రామసుబ్బారెడ్డిది ముమ్మాటికీ హత్యే
● కేసు నీరుగారిస్తే ఆందోళన చేస్తాం
● ప్రభుత్వ తీరుపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు
● మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
ఆగ్రహం
టీడీపీ బాండ్లతో
త్వరలో ఇంటింటికీ..
ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీల బాండ్లతో త్వరలో ఇంటింటికీ తిరగను న్నామని శిల్పా స్పష్టం చేశారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ నిర్వహించిన వెన్నుపోటు, యువతపోరు కార్యక్రమాలకు విశేష స్పందన లభించిందని, ప్రజలు, యువకులు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా హాజరు కావడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. కూటమి నేతలు ఇచ్చిన బాండ్లు తీసుకుని వెళ్లి ఎవరికి ఏ ప్రయోజనం చేకూరిందో తెలుసుకుని కూటమి ప్రభుత్వం దుర్మార్గాన్ని ఎండగడతామన్నారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ వాహనం కింద పడి ఒకరు మృతి చెందిన విషయంపై విలేకరులు ప్రస్తావించగా.. కూటమి నేతలు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పెయిడ్ ఆర్టిస్టులతో వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
మహానంది: కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజలకు శాంతి, భద్రత లేదని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. మసీదుపురం గ్రామానికి చేరుకుని రామసుబ్బారెడ్డి మృతి సమాచారం తెలుసుకున్న ఆయన శుక్రవారం గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి, మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. మృతుడి భార్య తులశమ్మ, సోదరుడు బుగ్గారెడ్డి, కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో శిల్పా మాట్లాడుతూ.. రామసుబ్బారెడ్డి పార్టీలకు అతీతుడని, సౌమ్యుడైన ఆయనను కూటమి నేతలు చంపేశారని, ఈత వచ్చినోడు ఎలా చస్తాడు, శరీరంపై గాయాలెందుకు ఉంటాయని, ఇది ముమ్మాటికీ హత్యేనన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి హత్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసును తప్పుదారి పట్టించాలని చూస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో శ్రీశైలం నియోజకవర్గంలో బండిత్మకూరు మండలం లింగాపురంలో ఒకటి, మహానంది మండలం సీతారామపురంలో మరొకటి, ఇప్పుడు మసీదుపురంలో ఇది మూడో హత్య అన్నారు.
మద్యం డోర్ డెలివరీ
కూటమి నేతలు కమీషన్ల కోసం గ్రామాల్లో మద్యం సీసాలను డోర్ డెలివరీ చేస్తున్నారని శిల్పా విమర్శించారు. పాల ప్యాకెట్లు దొరకని పల్లెల్లో 24 గంటలూ మద్యం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగ పాలన ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఆయన వెంట నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కొమ్మా పాలమహేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ కేవీఆర్ మహేశ్వరరెడ్డి, మసీదుపురం సర్పంచ్ కాకనూరు లక్ష్మీరెడ్డి, ఎంపీటీసీ మునగాల నాగమల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.