
మండలాల వారీగా సమస్యలు ఇవీ..
● మండల కేంద్రమైన వెల్దుర్తి ప్రజలను తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. వైఎస్సార్‌సీపీ పాలనలో రూ.3.5 కోట్లు ఖర్చు చేసి కృష్ణగిరి రిజర్వాయర్ ద్వారా రోజుకు 9 లక్షల లీటర్ల నీటిని మూడు సంపుల ద్వారా వెల్దుర్తికి నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ గురించి పట్టించుకోకపోవడంతో చుక్క నీరు రావడం లేదు. అలాగే గత ప్రభుత్వంలో వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట, గోవర్ధనగిరి గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు అయ్యాయి. సొంత భవనాలు లేకపోవడంతో వైద్య సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. సొంత భవనాలను నిర్మిస్తే దాదాపు 39 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందే అవకాశాలు ఉంటాయి.
● కోడుమూరు సబ్ డివిజన్ పరిధిలో 40 వేల ఎకరాలు ఎల్లెల్సీ ఆయకట్టు ఉన్నా, ప్రస్తుతం 400 ఎకరాలకు కూడా నీరందని పరిస్థితి నెలకొనింది. అలాగే కోడుమూరు నుంచి పులకుర్తి, కల్లపరి మీదుగా సీ బెళగల్ వరకు నడుస్తున్న ఆర్‌టీసీ బస్సు రద్దు కావడంతో ప్రజలు, ద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
● గాజులదిన్నె డ్యాం పక్కనే ఉన్నా మండల కేంద్రమైన గోనెగండ్లను తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. తుంగభద్ర కెనాల్‌లో నీటిని ఎస్‌ఎస్ ట్యాంకకు లిఫ్ట్ చేసి కుళాయిల ద్వారా నీటిని అందించాల్సి ఉంది. అయితే కెనాల్‌లో నీరు తగ్గిపోవడంతో రోజుకు 30 నుంచి 45 నిమిషాలు మాత్రమే నీటిని సరఫరా చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
● పెద్దకడుబూరు మండలంలోని బసలదొడ్డి, గవిగట్టు, పీకలబెట్ట, కంబదహాల్ గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొనింది. పులికనుమ రిజర్వాయర్ నుంచి నీరు సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు బోర్లపైనే అధారపడి ఇబ్బందులు పడుతున్నారు. నెదర్‌ల్యాండ్ స్కీం ఉన్నా కోసిగి మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కూడా తాగునీరు అందని పరిస్థితి నెల కొనింది. ఈ స్కీం నుంచి 16 గ్రామాలకు నీరు అందించాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగైదు గ్రా మాలకు మించి నీరు అందని పరిస్థితి నెలకొంది.
● మద్దికెర మండలం బరుజుల గ్రామ ప్రజలకు తాగునీరు అందడం లేదు. గ్రామంలోని బోర్లే వీరికి దిక్కవుతున్నాయి. తాగునీటిని 10 కిలోమీటర్ల దూరంలోని పత్తికొండ నుంచి తెచ్చుకుంటున్నారు. గుంతకల్ నుంచి పెరవలి మీదుగా ఆర్టీసీ బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు.