
వ్యక్తి ఆత్మహత్య
గోస్పాడు: కానాలపల్లె గ్రామానికి చెందిన పుల్లయ్య గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నా ఇతను పలు చోట్ల వైద్యం పొందినా నయం కాకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఈ మేరకు ఇంటి ముందు అలంకరణకు ఉపయోగించే రసాయన పౌడర్‌ను నీళ్లలో కలిపి తాగి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబీకులు గుర్తించి చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
కారు ఢీకొని జింక మృతి
మంత్రాలయం రూరల్: కల్లుదేవకుంట– మంత్రాలయం మధ్యలో 167వ జాతీయ రహదారిలో కారు ఢీకొని జింక మృతి చెందింది. కల్లుదేవకుంట గ్రామ సమీపంలో పొలంలో నుంచి జింక రోడ్డు దాటుతుండగా గురువారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఫారెస్టు అధికారిణి అనురాధ ఘటన స్థలానికి వచ్చి మృతి చెందిన జింకను తుంగభద్ర రిజ్వర్ ఫారెస్టుకి తీసుకెళ్లారు. వెటర్నరీ డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చే శారు.
ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి
జూపాడుబంగ్లా: ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు.. నందికొట్కూరు నుంచి గూడెం శ్రీనివాసులు అనే ఆటో డ్రైవర్ జూపాడుబంగ్లాకు బయలుదేరాడు. మార్గమధ్యంలో మండ్లెం గ్రామం వద్ద భవన నిర్మాణ కార్మికులు షేక్ ఇస్మాయిల్(50) అబ్దుల్లా, రఫీ ఎక్కారు. తంగడంచ చెక్‌పోస్ట్ మలుపు వద్దకు రాగానే వేగాన్ని డ్రైవర్ శ్రీనివాసులు అదుపు చేయలేకపోవడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మండ్లెం గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోడ్రైవర్ శ్రీనివాసులుకు రెండు కాళ్లు విరిగాయి. అబ్దుల్లా, రఫీకు తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం తెలు సుకున్న ఎస్‌ఐ ప్రమాద స్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
29న స్వేచ్ఛ సాంఘిక నాటక ప్రదర్శన
కర్నూలు (కల్చరల్): టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఈనెల 29న సాయంత్రం 7 గంటలకు సి.క్యాంప్ కళాక్షేత్రంలో స్వేచ్ఛ సాంఘిక నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. హైదరాబాదుకు చెందిన ప్రముఖ నాటక దర్శకుడు బీఎం రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సాంఘిక నాటక ప్రదర్శన ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా పరిషత్తు నాటక పోటీల్లో సంచలనం సృష్టించిందన్నారు. ఇందులో బలగం సినిమా ఫేమ్ సురభి లలిత ఒక ముఖ్య పాత్రను పోషిస్తుందని తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్య