
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
అవుకు: అతివేగానికి ఓ నిండు ప్రాణం బలైంది. అవుకు – బనగానపల్లె రహదారిలో గురువారం కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గో స్పాడు మండలం తేళ్లపురి గ్రామానికి చెందిన కాటంరెడ్డి నాగేంద్ర రెడ్డి(55) అవుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సొంత పనుల నిమిత్తం వచ్చాడు. పని పూర్తయిన అనంతరం స్వగ్రామానికి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో కోనాపురం మెట్ట సమీపంలోకి రాగానే బనగానపల్లె వైపు నుంచి వేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టడంతో నాగేంద్రరెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు అతి వేగంతో బైక్ నుజ్జునుజ్జు అయింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్న వ్యక్తి క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం అవుకు సీహెచ్‌సీకి తరలించారు. మృతుడి కుమారుడు నాగార్జునరెడ్డి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ లింగమయ్య తెలిపారు. మృతుడు నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డికి సమీప బంధువు కావడంతో ఆయన అవుకు సీహెచ్‌సీకి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే అవుకు ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డి కూడా ఆసుపత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.