
ప్రారంభించిన పది రోజులకే పగుళ్లు
పగిడ్యాల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె పండుగ పేరుతో నిర్మించిన రహదారులు మున్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. మండలంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ. 2.50 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ల నాణ్యత ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ఈ నెల 11వ తేదీన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పడమర ప్రాతకోటలోని సీసీ రోడ్లకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అయితే పది రోజులు కాక ముందే ముస్లిం కాలనీలోని సీసీ రోడ్డులో పగుళ్లు కనిపిస్తున్నాయి. అంతర్గత రోడ్ల అభివృద్ధి అంటూ హడావుడి చేసి కూటమి నేతలు సీసీ రోడ్లు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి జేబులు నింపుకున్నారనే విమర్శ లు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కమీషన్లకు కక్కుర్తిపడిన ఇంజినీరింగ్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలకు ఇచ్చారు. దీంతో దాదాపు 50 ఏళ్లు మన్నిక రావాల్సిన సీసీ రోడ్డు వారం రోజులకే పగిలిపోవడం చూసిన స్థానికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. స్థానిక టీడీపీ నాయకుడు మహేశ్వరరెడ్డి సిఫారసు మేరకు జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుడు మహేంద్రరెడ్డి అనే కాంట్రాక్టర్ గ్రామంలోని 15 పనులు చేపట్టి పూర్తి చేసినట్లు మండల ఇంజనీర్ జావేద్ తెలిపారు. దాదాపు రూ. 91 లక్షల పనులు ఈయననే పూర్తి చేశారన్నారు. సీసీ రోడ్లు పూర్తి చేసినప్పటికీ కాంట్రాక్టర్ ఏ రోడ్డుకు సైడ్ బర్మ్‌కు గ్రావెల్ వేయకుండా అలాగే వదిలేశారు. దీంతో వాహనాలు, ఎడ్ల బండ్లు, పాదాచారులు ఎక్కి, దిగేందుకు అవస్థలు పడుతు న్నారు. అలాగే డ్రైయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు ఇళ్ల ముందు నిలిచి పారిశుద్ధ్యం లోపిస్తున్నా పట్టించుకునే వారు లేరు. ఈ విషయమై పంచాయతీ రాజ్ శాఖ మండల ఇంజనీర్ జావేద్‌ను వివరణ కోరగా.. కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు పగిలిపోయే ఆస్కారమే లేదని.. త్వరలో గ్రామానికి చేరుకుని పరిశీలిస్తామన్నారు.