గడప దాటని దిగుబడి | - | Sakshi
Sakshi News home page

గడప దాటని దిగుబడి

Jun 26 2025 6:28 AM | Updated on Jun 26 2025 6:28 AM

గడప ద

గడప దాటని దిగుబడి

ఇతని పేరు పుల్లయ్య. ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన సన్నకారు రైతు. నాలుగు ఎకరాల సొంతపొలంతో పాటు రెండు ఎకరాల కౌలు భూమిలో పొగాకు సాగు చేశాడు. అలయన్స్‌ ఓన్‌ కంపెనీకి చెందిన పొగాకు నాటాడు. ఒప్పందాలతోనే సాగు చేసిన పొగాకు కొనుగోళ్ల సమయానికి కంపెనీ చెతులెత్తేయడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇంటి వద్దనే తొక్కిన బేళ్లను ఉంచుకుని ఆశగా బేల చూపులు చూస్తున్నాడు.

పొగాకు రైతులను

నట్టేట ముంచిన కంపెనీలు

మూడు నెలల్లో 45 శాతం మాత్రమే

కొనుగోళ్లు

బయ్యర్లు సిండికేట్‌తో

లభించని గిట్టుబాటు ధర

కార్యరూపం దాల్చని

ప్రభుత్వ పెద్దల ప్రకటన

నంద్యాల(అర్బన్‌): పొగాకు సాగుపై పలు కంపెనీలు రైతులను ప్రోత్సహించాయి. దిగుబడి అంతా కొంటామంటూ ఆశ పెట్టాయి. చివరకు పంట చేతికొచ్చే సమయంలో అదిగో ఇదిగో అంటూ మోసం చేశాయి. నాణ్యత పేరుతో దగా చేస్తున్నాయి. అండగా నిలవాల్సిన ప్రభుత్వం, పొగాకు బోర్డు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఓ వైపు పెట్టుబడి ఖర్చులు పెరగడం.. మరో వైపు మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో పొగాకు రైతు నిలువునా మోసపోయాడు. గత ఏడాది ఖరీఫ్‌ సాగు కింద జిల్లాలో 19 వేల హెక్టార్లలో పొగాకు సాగు చేశారు. దాదాపు 1,200 మంది రైతులు వివిధ కంపెనీలకు చెందిన పొగాకు పండించారు. హెక్టారుకు 31 బేళ్ల చొప్పున 19 వేల హెక్టార్లకు 5.89 లక్షల బేళ్లు సాగు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు 45 శాతం మాత్రమే కొనుగోలు చేయగా మిగిలిన 55 శాతం కొనుగోలు చేయాల్సి ఉంది. ఎకరాకు 10 నుంచి 15 బేళ్ల దాకా దిగుబడి వచ్చింది. దిగుబడులు ఆశాజనకంగా వచ్చినా కొనుగోళ్ల సమయానికి బయ్యర్లు చేతులెత్తేయడంతో పొగాకు బేళ్లను ఇళ్ల వద్ద, ఏసీ గోడౌన్లలో ఉంచాల్సి వచ్చింది. జిల్లాలో 12 ప్రైవేట్‌ పొగాకు కంపెనీల ద్వారా ఇప్పటి వరకు కేవలం 35 మిలియన్‌ కేజీల పొగాకు కొనుగోళ్లు జరిగినట్లు సమాచారం. కంపెనీల ఒప్పందం చేసుకున్న సాగు విస్తీర్ణం కంటే దాదాపు 1,800 హెక్టార్లలో సాగు పెరిగింది. దీంతో కంపెనీలకు కొనుగోళ్లు భారంగా మారినట్లు తెలుస్తోంది. అలయన్స్‌వన్‌, జీపీఏ, ఐటీసీ, ఎంఎల్‌, విఎస్జీటీ, తదితర కంపెనీల ద్వారా కొనుగోళ్లు జరిగాయి. ప్రస్తుతం ఎంఎల్‌, వీఎస్టీ కంపెనీలు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేశాయి.

నిండిపోతున్న కోల్డ్‌ స్టోరేజీలు..

మార్చి నెలలో ప్రారంభమైన పొగాకు కొనుగోళ్లు ఇప్పటి వరకు 45 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మార్కెట్‌లో ఆశించిన ధరలు రాకపోవడంతో రైతులు కొందరు తమ సరుకును తిరిగి కోల్డ్‌ స్టోరేజీలకు తరలిస్తుండగా మరికొందరు ఇళ్ల వద్ద షెడ్లలో ఉంచుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. జిల్లాలోని కోల్డ్‌ స్టోరేజీలు దాదాపు పొగాకు బేళ్లతో నిండిపోయాయి. సరుకును వేలం కేంద్రానికి తెచ్చి ధర రాక వెనక్కి తీసుకెళ్తుండటంతో రైతులపై అదనపు భారం పడుతోంది. అసలే ధర రాక అల్లాడుతుంటే ఇది తలకు మించిన భారంగా మారుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ధర నేల చూపు..

జిల్లా పరిధిలో గత ఏడాది క్వింటా గరిష్ట ధర రూ.28,000 పలుకగా ఈ ఏడాది వేలం నాలుగు నెలలు దాటుతున్నా ఇంత వరకు కనిష్ట ధరలకు మించలేదు. బయ్యర్లు సిండికేట్‌ గా మారి రైతుల వద్ద కొనుగోలు చేసిన వాటిలో పది శాతం బేళ్లకు గరిష్ట ధర ఇవ్వడం లేదు. చాలా ప్రాంతాల్లో సరాసరి ధర రూ.10,000 నుంచి రూ.13,000 కి మించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా నాణ్యత పేరుతో ధరలు తగ్గించేస్తుండటంతో పెంచిన బేళ్లను వెనక్కి తీసుకెళ్లలేక వచ్చిన ధరకు తెగనమ్ముకుంటున్నారు. గ్రేడ్‌ పేరుతో గరిష్ట ధర రూ.130కి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పది రోజుల వ్యవధిలో కేజీ మీద రూ.20 నుంచి రూ.30 వరకు తగ్గించేశారు. రోడ్లపై బైఠాయించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారని రైతులు కోరుతున్నారు.

జిల్లాలో పొగాకు సాగు వివరాలు ఇలా..

పొగాకు సాగు విస్తీర్ణం: 19 వేల హెక్టార్లు దిగుబడి: 5.89 లక్షల బేళ్లు

దగా పడి నష్టపోయి

ఈయన పేరు ఏసన్న. మిడుతూరు మండలం వీపనగండ్ల గ్రామానికి చెందిన రైతు. ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని జీపీఐ కంపెనీకి చెందిన పొగాకు నాటాడు. 70 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే ఇప్పటి వరకు కేవలం 18 క్వింటాళ్లు మాత్రమే ఆ కంపెనీ కొనుగోలు చేసింది. ఎకరాకు రూ. 1.20 లక్షల ప్రకారం ఐదెకరాలకు దాదాపు రూ. 6 లక్షల వరకు ఖర్చు పెట్టి సాగు చేశాడు. పంట చేతికొచ్చిన సమయంలో సరైన ధర లేకపోవడం, ఒప్పందం చేసుకున్న కంపెనీ మోసం చేయడంతో నట్టేట మునిగాడు.

మంత్రి హామీకి 20 రోజులు..

ఇటీవల టెక్కె మార్కెట్‌యార్డులో జరిగిన మినీ మహానాడు వేదికలో నాణ్యమైన పొగాకును మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి ప్రకటించారు. అయితే రైతులు దిగుబడిని మొత్తం కొనుగోలు చేయాలని రోడ్డెక్కారు. ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఆందోళనలకు స్పందించిన మంత్రి నాణ్యతను బట్టి పొగాకు కొనుగోలు జరిగేలా చర్యలు చేపడుతామని చెప్పారు. హామీ ఇచ్చి 20 రోజులు అవుతున్నా పొగాకు కొనుగోళ్లపై ప్రభుత్వం, అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు ఆందోళన కరమైన పరిస్థితుల్లో కొనుగోళ్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది.

గడప దాటని దిగుబడి 
1
1/2

గడప దాటని దిగుబడి

గడప దాటని దిగుబడి 
2
2/2

గడప దాటని దిగుబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement